ఇంగ్లాండ్‌ చేతిలో విండీస్ చిత్తుగా.. !

వెస్టిండీస్‌ను చిత్తుగా ఓడించింది ఇంగ్లీష్ జట్టు. విండీస్ నిర్దేశించిన 213 పరుగుల లక్ష్యాన్ని 33.1 ఓవర్లకు 2 వికెట్లు నష్టపోయి ఛేదించింది. జో రూట్‌ (100*; 94 బంతుల్లో 11×4) ప్రపంచకప్‌లో రెండో శతకం సాధించాడు. జానీ బెయిర్‌ స్టో (45), క్రిస్‌వోక్స్‌ (40) సమయోచితంగా ఆడారు. విండీస్‌లో షానన్ గాబ్రియేల్‌ 2 వికెట్లు తీశాడు.

అంతకు ముందు భారీ స్కోరు చేస్తుందనుకున్న విండీస్‌ నిరాశపరిచింది. 44.4 ఓవర్లకు 212 పరుగులకు ఆలౌటైంది. నికోలస్‌ పూరన్‌ (63) అర్ధశతకం చేశాడు. 26 ఓవర్లకు విండీస్‌ 130/3తో ఉంది. ఐతే, ఆ తర్వాత వరుసగా వికెట్లు చేజార్చుకొంది. రూట్‌ కీలక సమయంలో వికెట్‌ తీశాడు. 29.5వ బంతిని ఆడబోయిన హెట్‌మైయిర్‌(39; 48 బంతుల్లో 4×4) బౌలర్‌కే నేరుగా క్యాచ్‌ ఇచ్చాడు. రూట్‌ వేసిన 31.6వ బంతికి జేసన్‌ హోల్డర్‌ (9; 10 బంతుల్లో 1×6) ఔటయ్యాడు. రూటు ఇటు బౌలింగ్‌, అటు బ్యాటింగ్ లోనూ సత్తా చాటాడు. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు. ఆర్చర్‌, మార్క్‌వుడ్‌ తలో మూడు వికెట్లు తీశారు. జో రూట్‌కు 2 వికెట్లు దక్కాయి.