రివ్యూ : గేమ్ ఓవర్
చిత్రం : గేమ్ ఓవర్ (2019)
నటీనటులు : తాప్సి, వినోదిని వైద్యనాథన్, అనీష్ కురువిల్లా, సంచిత నటరాజన్, రమ్య సుబ్రహ్మణ్యన్, పార్వతి తదితరులు
సంగీతం : రోన్ ఏతాన్ యోహాన్
దర్శకత్వం : అశ్విన్ శరవణన్
నిర్మాత : ఎస్.శశికాంత్
రిలీజ్ డేటు : 14 జూన్, 2019.
రేటింగ్ : 4/5
తెలుగులో తాప్సీకి అన్యాయం జరిగింది. ఆమె గ్లామర్ ని మాత్రమే వాడుకొన్నారు. నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలు తాప్సీకి దక్కలేదు. ఐతే, బాలీవుడ్ లో మాత్రం నటనకి ప్రాధాన్యమున్న చిత్రాల్లో నటిస్తూ తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపుని తెచ్చుకుంది తాప్సీ. అలాగని టాలీవుడ్ కు దూరం కాలేదు. ఇక్కడ యేడాది ఓ సినిమానైనా చేస్తోంది. తాప్సీ తాజా చిత్రం ‘గేమ్ ఓవర్’. అశ్విన్ శరవణన్ దర్శకుడు. వినోదిని వైద్యనాథన్, అనీష్ కురువిల్లా, సంచిత నటరాజన్, రమ్య సుబ్రహ్మణ్యన్, పార్వతి తదితరులు కీలక పాత్రల్లో నటించారు. తెలుగు, తమిళ్ బాషల్లో గేమ్ ఓవర్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. మరీ.. తాప్సీ గేమ్ ప్రేక్షకులని ఏ మేరకు ఆకట్టుకుందో తెలుసుకొనేందుకు రివ్యూలోకి వెళదాం పదండీ.. !
కథ :
స్వప్న (తాప్సి) ఒక వీడియో గేమ్ డిజైనర్. ఆమెకి గేమ్స్ ఆడటమన్నా ఇష్టమే. అనుకోకుండా ఆమె జీవితంలో ఓ సంఘటన చోటు చేసుకుంటుంది. స్వప్న తన చేతికి ఒక పచ్చబొట్టు వేయించుకుంటుంది. ఆ పచ్చబొట్టు రంగులో అమృత (సంచిత నటరాజన్) అస్తికలు కూడా కలుస్తాయి. అప్పట్నుంచి చీకటంటే భయపడుతుంటుంది. తల్లిదండ్రులకి దూరంగా, పని మనిషి కళమ్మతో కలిసి ఒక ఇంట్లో నివసిస్తుంటుంది. ఇంతకీ అమృత ఎవరు? ఆమె ఎలా చనిపోయింది? అమృత తరహాలోనే స్వప్నకి కొన్ని సంఘటనలు ఎదురైనప్పుడు వాటిని ఎలా ఎదుర్కొంది ? అనేది థ్రిల్లింగ్ అంశాలతో కూడిన కథ గేమ్ ఓవర్.
ప్లస్ పాయింట్స్ :
* కథ-కథనం
* తాప్సీ నటన
* నేపథ్య సంగీతం, సినిమాటోగ్రఫీ
మైనస్ పాయింట్స్ :
* పెద్దగా లేవు
నటీనటుల ఫర్ ఫామెన్స్ :
కథ మొదలవగానే ప్రేక్షకుడిని స్వప్న ప్రపంచంలోకి తీసుకెళతాడు దర్శకుడు. ఒక ఆత్మ కథతో పాటు… సీరియల్ కిల్లర్స్ నేపథ్యాన్ని, మానసిక పరమైన సంఘటనల్ని ఇందులో స్పృశించిన విధానం ఆకట్టుకుంటుంది. క్రైమ్ థ్రిల్లర్ కథల్లో మలుపుల వెనక సంఘటనలు చివరి వరకుగానీ రివీల్ కావు. కానీ ఈ సినిమాలో కీలకమైన మలుపుల వెనక సంఘటనల్ని ముందుగానే బయటపెట్టాడు దర్శకుడు. అయినా చివరివరకు ఉత్కంఠని రేకెత్తిస్తూ సన్నివేశాల్ని తీర్చిదిద్దారు.
థ్రిల్లర్ సినిమాలు ఇష్టపడే ప్రేక్షకులకి గేమ్ ఓవర్ బాగా నచ్చుతుంది. తాప్సీ స్వప్న పాత్రలో ఒదిగిపోయింది. చక్కటి హావభావాలు పలికిస్తూ పాత్రలో సహజంగా ఒదిగిపోయింది. నటనలో తాప్సి పరిణతిని చాటి చెప్పే చిత్రమిది. తాప్సీ కి ఈ సినిమా జాతీయ అవార్డుని తెచ్చిపెట్టిన ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. అద్భుతంగా నటించింది తాప్సీ. పని మనిషి పాత్రలో వినోదిని వైద్యనాథన్ నటన బాగుంది. అమృత అనే అమ్మాయిగా సంచిత ఆకట్టుకుంటుంది.
సాంకేతికంగా : రోన్ ఏతాన్ యోహాన్ అందించిన సంగీతం బాగుంది. నేపథ్య సంగీతంతో మేజిక్ చేశాడు. ఎ.వసంత్ సినిమాటోగ్రఫీ బాగుంది. అది సినిమాకే హైలైట్ గా నిలిచింది. తాప్సీ తర్వాత సినిమాలో హీరోగా సినిమాటోగ్రఫీని చెప్పవచ్చు. ఎడిటింగ్ షార్ప్ గా ఉంది. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి.
బాటమ్ లైన్ : గేమ్ ఓవర్ – తాప్సీ గేమ్ రసవత్తరంగా ఉంది
రేటింగ్ : 4/5