ధావన్ పరిస్థితిపై కోహ్లీ స్పందన
ఆదివారం ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో ఎడమచేతి బొటనవేలికి గాయమైన ఓపెనర్ శిఖర్‌ధావన్‌కు మూడు వారాలపాటు విశ్రాంతి అవసరమని వైద్యులు తెలిపిన సంగతి తెలిసిందే. దీంతో ప్రపంచకప్‌లో అతడి స్థానంపై సందిగ్ధత నెలకొంది. టీమిండియా ఆడబోయే తదుపరి మూడు మ్యాచ్ లకి ధావన్ దూరంకానున్నాడు. ఆ తర్వాత మ్యాచ్ లకైనా అందుబాటులో ఉంటారా ? అనేది ధావన్ ని మరోసారి పరీక్షించిన తర్వాత క్లారిటీ రానుంది. కెప్టెన్ విరాట్‌కోహ్లీ ఓపెనర్ శిఖర్‌ధావన్ పరిస్థితిపై తాజాగా స్పందించాడు.
గురువారం న్యూజిలాండ్‌తో మ్యాచ్ రద్దయ్యాక కోహ్లీ మాట్లాడుతూ.. తర్వాతి మ్యాచ్‌ల్లో ధావన్ తిరిగి ఆడతాడని తెలిపాడు. ప్రస్తుతం ధావన్ వేలికి ప్లాస్టర్ వేసుందని, రెండు మూడు వారాల తర్వాత అతడి పరిస్థితి సమీక్షించి ఎలా స్పందిస్తాడో చూస్తామన్నాడు. ధావన్ త్వరగా కోలుకొని మిగతా లీగ్ మ్యాచ్‌లతో పాటు సెమీఫైనల్స్‌లో ఆడతాడని కోహ్లీ ఆశాభావం వ్యక్తంచేశాడు. ఇక, ఆదివారం టీమిండియా చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్‌లో రోహిత్‌కు జోడీగా కేఎల్ రాహుల్ ఓపెనింగ్ చేసే అవకాశం ఉంది.