బిగ్ బాస్ హోస్ట్’గా పవన్.. ఎందుకు చేయకూడదు ?

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కు మళ్లీ సినిమాలు చేసే ఆలోచన లేనట్టు కనబడుతోంది. కట్టేకాలే వరకు ప్రజాసేవలోనే ఉంటా. రాజకీయాలని వదలనని ఇటీవలే పవన్ స్పష్టం చేశారు. దాంతో పవన్ ని మళ్లీ తెరపై చూడాలని ఆశపడుతున్న అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మరికొందరు అభిమానులు మాత్రం పవన్ సినిమాలు చేయకపోయినా పర్వాలేదు.. బిగ్ బాస్ లాంటి షోకు హోస్ట్ గా వ్యవహరిస్తే బాగుంటుందని సూచిస్తున్నారు. దాని వలన పవన్ గొంతు ప్రతిరోజు ప్రతి తెలుగింట్లో వినిపిస్తోంది.

అది పవన్ కి పొలిటికల్ గా ఉపయోగపడుతుంది. పవన్ హోస్ట్ గా వ్యవహరిస్తే.. బిగ్ బాస్ క్రేజ్ మరింత పెరుగుతుందని చెబుతున్నారు. అదీ నిజమే. కానీ, అందుకు పవన్ ఒప్పుకొంటాడా ? అనేది ప్రశ్న. బిగ్ బాస్ తెలుగు సీజన్ 1కి యంగ్ టైగర్ ఎన్ టీఆర్ హోస్ట్ గా వ్యవహరించారు. బిగ్ బాస్ ని తీసుకెళ్లి ఓ రేంజ్ లో నిలబెట్టారు. ఆ రేంజ్ ని నిలబెట్టడానికి సీజన్ 2కు హోస్ట్ గా వ్యవహరించిన నేచురల్ స్టార్ నాని కిందా మీదా పడాల్సి వచ్చింది. ఇప్పుడు సీజన్ 3 కోసం నాగార్జున హోస్ట్ గా చేయబోతున్నారు.

ఐతే, నాగార్జున కంటే పవన్ కల్యాణ్ హోస్ట్ గా వ్యవహరిస్తే బాగుంటుందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. పవన్ సంగతి పక్కనపెడితే.. ఆయన మాజీ భార్య రేణు దేశాయ్ మాత్రం అవకాశం వస్తే బిగ్ బాస్ షోకి హోస్ట్ గా వ్యవహరిస్తానని అన్నారు. త్వరలోనే ప్రారంభం కానున్న బిగ్ బాస్ 3 కోసం రేణు దేశాయ్ ని తీసుకొన్నారనే ప్రచారం జరుగతోంది. దీనిపై స్పందించిన రేణు.. తాను బిగ్‌బాస్‌లో పాల్గొనడంలేదని స్పష్టం చేశారు. ఐతే, బిగ్ బాస్ హోస్ట్ గా అవకాశం వస్తే చేస్తానని మనసులోని మాటని తెలిపారు.