మంత్రి మల్లారెడ్డికి కూడా వేధింపులు
ఇటీవల కాలంలో సైబర్ వేధింపులు ఎక్కువయ్యాయి. సినీ, రాజకీయ ప్రముఖులని టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో అసభ్య కథనాలు, వీడియోలు పోస్ట్ చేస్తున్నారు. దీనిపై ప్రముఖులు సైబర్ క్రైమ్ పోలీసులని ఆశ్రయిస్తున్నారు. ఇటీవలే మెగాస్టార్ చిరంజీవి చిన్నల్లుడు కల్యాణ్ దేవ్ తనకి ఎదురవుతున్న సైబర్ వేధింపులపై పోలీసులకి ఫిర్యాదు చేశారు. పూనమ్ కౌర్, లక్ష్మీ పార్వతీలని వేధించిన కోటి అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. తాజాగా, మంత్రి మల్లార్లెడ్డి కూడా సైబర్ వేధింపులపై ఫిర్యాదు చేశారు.
సామాజిక మాధ్యమాల్లో మంత్రి మల్లారెడ్డిపై గుర్తు తెలియని వ్యక్తులు అసత్య కథనాలు ప్రసారం చేస్తున్నారంటూ ఆయన ఓఎస్‌డీ సుధాకర్‌రెడ్డి హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కొద్దిరోజుల నుంచి మంత్రికి వ్యతిరేకంగా తప్పుడు కథనాలు పోస్ట్ చేస్తున్నట్టు ఆయన పేషీకి వస్తున్న వారిలో కొందరు ఓఎస్‌డీ దృష్టికి తీసుకొచ్చారు. వాటిని పరిశీలించిన సుధాకర్‌రెడ్డి ఆ కథనాలు, వీడియోలు అభ్యంతరకంగా ఉన్నాయని గుర్తించి, పోలీస్ ఉన్నతాధికారులతో మాట్లాడారు. వారి సూచనల మేరకు సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీస్ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.