భారత్‌×పాక్‌ మ్యాచ్‌.. మాజీలు ఏమన్నారంటే ?

మరికొద్ది గంటల్లో దాయాదుల సమరం మొదలుకానుంది. ఈ ఉద్విగ్న పోరు కోసం ప్రపంచం మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. భారత్‌కే విజయావకాశాలు ఎక్కువ. ఐతే, ఎప్పుడెలా ఆడుతుందో తెలియని పాక్‌ను తక్కువ అంచనా వేయలేం. దాయాదుల సమరం గురించి పలువురు క్రికెట్‌ దిగ్గజాలు స్పందించారు. ఇంతకీ భారత్‌×పాక్‌ మ్యాచ్‌పై మాజీలు ఏమన్నారంటే ?

సచిన్ : ప్రపంచకప్‌లో పాక్‌పై మనకు 6-0తో మెరుగైన రికార్డే ఉంది. ఛాంపియన్స్‌ ట్రోఫీ (2017)లో మాత్రం పాక్‌దే పైచేయి. ప్రస్తుతం ఫామ్‌, రికార్డు పరంగా మనమే ఒక్క అడుగు ముందున్నాం. ఐతే ఇలాంటి పరిస్థితుల్లో అతి విశ్వాసాన్ని దరిచేయనీయరాదు. విశ్వాసం మంచిదే కానీ అది అతిగా ఉండకూడదు. మరోవైపు ఫామ్‌లో ఉన్న పాక్‌ పేసర్‌ మహ్మద్‌ ఆమిర్‌ బౌలింగ్‌లోనూ మన బ్యాట్స్‌మెన్‌ దూకుడుగా ఆడాలి. అతడిని ఒత్తిడిలోకి నెట్టాలి

సౌరవ్‌ గంగూలీ : భారత్‌ జాగ్రత్తగా ఆడాలి. మనం ఫేవరేట్స్‌ కాదనే ఆలోచనతోనే బరిలోకి దిగాలి. గత రికార్డులను దృష్టిలో పెట్టుకొని బరిలోకి దిగినందుకే 2017లో ఛాంపియన్స్‌ ట్రోఫీ చేజార్చుకున్నాం. ముందు ఈ దృక్పథాన్ని విడనాడాలి. పాక్‌ ఎలా ఆడుతుందో ఎప్పటికీ అంచనా వేయలేం. వాళ్లు ఎప్పటికీ ప్రమాదకరమే. అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ కోహ్లీసేన ముందుకు సాగాలి.

వసీం అక్రమ్‌ : భారత టాప్‌ ఆర్డర్‌ చాలా బలంగా ఉంది. విరాట్‌ కోహ్లీ, రోహిత్‌ శర్మలు మంచి ఫామ్ లో ఉన్నారు. కానీ మిడిలార్డర్‌ విషయంలో కొన్ని లోటుపాట్లు కనిపిస్తున్నాయి. పాక్‌ బౌలర్లు ఎక్కువగా అక్కడ దృష్టి సారించి అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి. పాక్‌ జట్టులో బాబర్‌ అజామ్‌ నాణ్యమైన ఆటగాడు. నిలకడగా రాణిస్తున్నాడు. కోహ్లీలా ఆడాలని తన ఆలోచనను మానుకొని స్వేచ్చగా రాణించడానికే ప్రాధాన్యతనివ్వాలి.

హర్భజన్‌ సింగ్‌ : పాక్ తో మ్యాచ్‌ అంటే ప్రతి ఒక్క క్రికెటర్‌ అద్భుతంగా ఆడాలని కోరుకుంటాడు. అందుకే వారిపై కచ్చితంగా ఒత్తిడి పెరుగుతుంది. అది కేవలం భారత ఆటగాళ్లపైనే కాదు. పాక్‌ క్రికెటర్ల పైనా ఉంటుంది. అయితే ఈ టోర్నీలో రికార్డు పరంగా మనదే పైచేయి కావడంతో ప్రస్తుత మ్యాచ్‌లోనూ గెలవాలని భారత ఆటగాళ్లు కోరుకుంటారు. అభిమానులూ అదే ఆశిస్తారు. ఫలితంగా వారిపై ఒత్తిడి అనూహ్యంగా పెరుగుతుంది. అలాగని ఈ రికార్డును చేజార్చుకోవద్దు. దాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలి.