రివ్యూ : మల్లేశం

చిత్రం : మల్లేశం (2019)

నటీనటులు : ప్రియదర్శి, ఝాన్సీ, చక్రపాణి, అనన్య, లక్ష్మణ్ ఏలె, గంగవ్వ, తాగుబోతు రమేష్ తదితరులు

సంగీతం : మార్క్ కె రాబిన్

దర్శకత్వం : రాజ్ ఆర్

నిర్మాతలు : రాజ్ ఆర్, శ్రీ అధికారి

రిలీజ్ డేట్ : 21జూన్, 2019.

రేటింగ్ : 3.5/5

తెర మరుగున, మనకు తెలియని విజేతలు చాలా మంది ఉంటారు. వాళ్ల కథలూ స్ఫూర్తి నింపుతుంటాయి. ఐతే, పనికట్టుకుని మరీ తెలుసుకోవాల్సిన కథ ‘మల్లేశం’. సరైన ప్రోత్సాహం లేకుండా కుదేలైపోతున్న చేనేత పరిశ్రమకు వెన్నెదన్నుగా నిలిచి, వాళ్ల కోసం ఆసు యంత్రాన్ని కనిపెట్టి, అందుకోసం తన జీవితాన్ని ధారబోసిన చింతకింది మల్లేశం కథ చాలామందికి ఆదర్శం. ఆ కథని ‘మల్లేశం’ పేరుతో తెరపైకి తీసుకొచ్చారు రాజ్‌. మరి ఈ సినిమా ఎలా ఉంది ? ఈ కథ ఇచ్చిన స్ఫూర్తి ఏమిటి ? తెలుసుకొనేందుకు రివ్యూలోకి వెళదాం పదండీ.. !

కథ :

నల్గొండ జిల్లాలోని శారాజీపేట గ్రామానికి చెందిన మల్లేశం (ప్రియదర్శి)ది దిగువ మధ్యతరగతి కుటుంబం. అమ్మానాన్నలకు చేనేతే ఉపాధి. అక్కడ చాలా కుటుంబాలకు చేనేత వృత్తి జీవనాధారం. ఐతే, శ్రమకు తగిన ఫలితం లభించక ఎంతో మంది అప్పుల ఊబిలో కూరుకుపోతారు. మల్లేశం కుటుంబం కూడా చేనేత వృత్తి మీదనే జీవనం సాగిస్తుంటుంది. చదువంటే ఇష్టం ఉన్నప్పటికీ కుటుంబ పరిస్థితుల కారణంగా ఆరోతరగతిలోనే చదువు మానేస్తాడు మల్లేశం. తండ్రి ఆదేశంతో మగ్గం మీద పనిచేస్తుంటాడు.

ఆసుపోస్తూ తల్లి లక్ష్మి (ఝాన్సీ) పడే రెక్కల కష్టం చూసి మల్లేశం చలించిపోతాడు. ఆసు పోయడం మానుకోకపోతే భుజం పనిచేయని పరిస్థితి వస్తుందని డాక్టర్.. లక్ష్మికి సలహా ఇస్తాడు. దీంతో ఎలాగైనా అమ్మ కష్టాలను దూరం చేయాలని నిశ్చయించుకుంటాడు మల్లేశం. కానీ ఎన్నిసార్లు ప్రయత్నించినా అనుకున్న గమ్యం చేరుకోలేకపోతాడు. ఈ ప్రయాణంలో ఎన్నో అవమానాలు, ఛీత్కారాలు. ఆఖరికి ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యతో కూడా మాటలు పడాల్సిన పరిస్థితి. ఈ దశలో మల్లేశం ఆత్మహత్యకీ ప్రయత్నిస్తాడు. ఆ తరవాత మల్లేశం కథ ఎలా మారింది? ఆసు యంత్రం తయారు చేయడానికి ఎన్ని ఆపసోపాలు పడ్డాడు? చివరికి తన గమ్యాన్ని ఎలా చేరుకున్నాడు ? అనేదే కథ.

ప్లస్ పాయింట్స్ :

* కథ-కథనం

* నటీనటుల ప్రతిభ

* పాటలు, నేపథ్య సంగీతం

* తెలంగాణ యాస, బాష

మైనస్ పాయింట్స్ :

* లేవనే చెప్పాలి

నటీనటుల ప్రతిభ :

చింతకింది మల్లేశం జీవిత కథ ఇది. 1990లో సాగే కథ. అప్పటి వాతావరణం, ఆనాటి ఆటలు, మనస్తత్వాలు.. ఇవన్నీ తెరపై చూపించారు. అప్పట్లో పెళ్లిళ్లు, వినోద కార్యక్రమాలు ఎలా సాగేవో పూస గుచ్చినట్టు వివరించారు. మల్లేశం బాల్యం, యవ్వనం, పెళ్లి.. ఇవన్నీ సరదాగానే సాగిపోతాయి.

ఎప్పుడైతే ఆసు యంత్రం కనుక్కోవాలన్న తాపత్రయం మల్లేశంలో పుడుతుందో అప్పుడు కథలో సీరియస్‌నెస్‌ వస్తుంది. ద్వితీయార్ధం మొత్తం ఆసు యంత్రంపై మల్లేశం చేసే పోరాటమే కనిపిస్తుంది. ప్రతిసారీ ప్రయత్నించడం, ఓడిపోవడం, మళ్లీ ప్రయత్నానికి పూనుకోవడం, పతాక సన్నివేశాల వరకూ ఇదే తంతు.. దాన్ని ఆసక్తికరంగా, భావోద్వేగభరితంగా చూపించడంలో దర్శకుడు రాజ్‌ విజయం సాధించాడనే చెప్పాలి.

మల్లేశంగా ప్రియదర్శి జీవించేశాడు. నవ్వులు పంచే ప్రియదర్శిలో ఇంత లోతైన నటుడున్నాడా? అనిపిస్తుంది. అనన్య నటన కూడా సహజంగా ఉంది. భార్యాభర్తల అన్యోన్యతని చాలా బాగా చూపించారు. ప్రముఖ యాంకర్‌ ఝాన్సీకి చాలా కాలం తరవాత గుర్తుండిపోయే పాత్ర పడింది. మల్లేశం స్నేహితులుగా నటించిన ఇద్దరూ తమ పాత్ర పరిధి మేర బాగానే చేశారు. ఎలాంటి కమర్షియల్‌ సూత్రాలకూ లొంగిపోకుండా నిజాయతీగా కథని చెప్పే ప్రయత్నం చేశారు.

సాంకేతికంగా :

పాటలు, మాటలు బాగున్నాయి. సినిమాటోగ్రఫీ అద్భుతంగా ఉంది. తెలంగాణ అందాలని బాగా చూపించారు. మార్క్ కె రాబిన్ అందించిన పాటలు, నేపథ్య సంగీతం బాగుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి.

చివరగా : సంకల్పబలం, కష్టాలకు వెరవని తత్వం ఉంటే సామాన్యులు సైతం మహత్తర లక్ష్యాన్ని సాధించవొచ్చనే గొప్ప సందేశమిచ్చాడు మన ‘మల్లేశం’.