చంద్రబాబుకు ఎంపీల వెన్నుపోటు !

తెదేపా ఎంపీలు సుజనా చౌదరి, సీఎం రమేశ్‌, గరికపాటి మోహన్‌రావు, టీజీ వెంకటేశ్‌ లు భాజాపాలో చేరారు. అంతేకాదు.. తెదేపా రాజ్యసభాపక్షాన్ని భాజాపాలో విలీనం చేస్తున్నట్టు రాజ్యసభ ఛైర్మన్‌, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడికి లేఖ కూడా అందజేశారు. భాజాపాలో చేరిన ఈ నలుగురు తెదేపా ఎంపీలు చంద్రబాబు అత్యంత సన్నిహితులు. కొందరు వీరిని చంద్రబాబు బినామీలు అని కూడా పిలుస్తుంటారు. వీరు సమయం చూసుకొని చంద్రబాబుకు వెన్నుపోటు పొడిచారనే కామెంట్స్ వినిపిస్తున్నాయ్.

ప్రస్తుతం చంద్రబాబు ఐరోపా పర్యటనలో ఉన్నారు. ఈ నేపథ్యంలో నలుగురు తెదేపా ఎంపీలు భాజాపాలో చేరడం హాట్ టాపిక్ గా మారింది. భాజాపాలు చేరిన నలుగురు ఎంపీలు కూడా వ్యాపారవేత్తలే. వీరిలో సుజనా, సీఎం రమేష్ ల ఆఫీసులపై ఈ మధ్య తరచూ ఐటీ దాడులు జరుగుతూనే ఉన్నాయి. వాటి నుంచి తప్పించుకోవడం కోసమే వీరంతా పార్టీ మారినట్టు ప్రచారం జరుగుతోంది. మరికొందరు..వీరిని స్వయంగా చంద్రబాబుయే భాజాపాలో చేరమని చెప్పారని చెప్పుకొంటున్నారు. రాజకీయ వ్యూహంలో భాగంగానే చంద్రబాబు ఈ సూచన చేసి ఉంటారని పచ్చ పార్టీ శ్రేణుల్లో కొందరు అంటున్నారు. జనాలు మాత్రం తెదేపా ఎంపీలు చంద్రబాబుకు వెన్నుపోటు పొడిచారని చెప్పుకొంటున్నారు. వీరి బాటలో చాలామంది తెదేపా నేతలు కమలం గూటికి చేరలే కనిపిస్తున్నారు.