టీడీపీ-భాజాపా మ్యాచ్ ఫిక్సింగ్ ?

ఏపీలో భాజాపా గేమ్ ప్లాన్ ని అమలు చేసే పనిలో పడింది. ఏపీలో టీడీపీని చావుదెబ్బ కొట్టేందుకు పరోక్షంగా వైకాపా సహకరించింది కమలం పార్టీ. ఆ వ్యూహాం ఫలించింది. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ ఘోరం పరాజయం పాలైంది. ఆ పార్టీకి కేవలం 23స్థానాలు దక్కాయి. ఇప్పుడు ఏపీలో వైకాపా ప్రత్యామ్నాయ మరేందుకు భాజాపా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా టీడీపీ నేతలని పార్టీలో చేర్చుకొంటోంది. ఇప్పటికే నలుగురు టీడీపీ ఎంపీలు బీజేపీలో చేరారు. ఇంకా వందలాది మంది చేరేందుకు రెడీగా ఉన్నారు.

ఈ నేపథ్యంలో వైకాపా అలర్టయింది. ఇదంతా మ్యాచ్ ఫిక్సింగ్ నే. స్వయంగా చంద్రబాబునే తన పార్టీ నేతలని బీజేపీలోకి పంపిస్తాడనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. వైకాపా కీలక నేత, ఎంపీ విజయసాయిరెడ్డి కూడా ఇదే అంటున్నారు. భాజాపాతో బాబు మ్యాచ్ ఫిక్సింగ్ అంటూ ఆయన వరుస ట్విట్ చేశారు. ఇంతకీ విజయసాయి ఏమన్నాడంటే.. ?

“బీజేపీలో చేరిన నలుగురు రాజ్యసభ సభ్యుల్లో ముగ్గురు చంద్రబాబు బినామీలే. తనపై అవినీతి కేసులు పెట్టకుండా రక్షణ కోసమే వారిని పంపించారు. తనకు తెలియకుండానే జరిగితే ఫిరాయించిన వారిని అనర్హులుగా ప్రకటించాల్సిందిగా రాజ్యసభ చైర్మన్‌కు లేఖ అయినా రాసి ఉండేవారు. ఇది 100% మ్యాచ్ ఫిక్సింగే”

“నలుగురు టీడీపీ ఎంపీలు పార్టీ మారితే అనుకూల మీడియా చాలా జాగ్రత్తగా, బీజేపీకి ఆగ్రహం తెప్పించకుండా వార్తలు రాసింది. రెండేళ్ల నుంచి బీజేపీ, మోదీపైన దుమ్మెత్తి పోసిన మీడియా ఇప్పుడు బాబు తీసుకున్న లైన్‌ను అర్థం చేసుకుంది. బీజేపీని ప్రశంసించే వార్తలొస్తాయి ఇక నుంచి”

“చంద్రబాబు విహార యాత్రకు ఏ దేశం వెళ్లారో ఆ పార్టీ నాయకులకూ తెలియదు. స్విట్జర్లాండ్ వెళ్లారో స్వీడన్‌లో ఉన్నారో చెప్పలేనంత రహస్యమా? ఎల్లో మీడియా కూడా యూరప్ నుంచి ముఖ్య నాయకులతో ఫోన్లో మాట్లాడి ధైర్యం చెప్పారని రాసింది. యూరప్ అనేది దేశం కాదు. 44 దేశాలున్న ఖండమని అందరికీ తెలుసు” అంటూ వరుస ట్విట్ చేశారు విజయసాయి. మరీ.. నిజంగానే భాజపా-తెదేపా మ్యాచ్ ఫిక్సింగే అంటారా ? అదే నిజమైతే.. వైకాపాకు చెక్ పెట్టేందుకు బీజేపీ గేమ్ ప్లాన్ మొదలైనట్టే.. !