29 తెరాస కార్యాలయాలకు శంకుస్థాపన
ప్రతి జిల్లాలోనూ పార్టీ కార్యాలయం ఉండాలని తెరాస నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జిల్లా కార్యాలయ భవనాల శంకుస్థాపన కార్యక్రమాలు రాష్ట్రవ్యాప్తంగా సోమవారం జరగనున్నాయి. ఒకే రోజు 29 చోట్ల శంకుస్థాపనలు చేపట్టనున్నారు. ఉదయం 10 గంటల నుంచి 11 మధ్యలో మంచి ముహూర్తం ఉన్నందున ఆ సమయంలోనే కార్యక్రమాన్ని పూర్తి చేయాలని పార్టీ అధిష్ఠానం ఆదేశించింది.
మొత్తం 33 జిల్లాల్లోనూ కార్యాలయాలుండాలని పార్టీ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ నిర్ణయించారు. తెరాసకు ఇప్పటి వరకు ఖమ్మం, వనపర్తి జిల్లాల్లో కార్యాలయాలున్నాయి. 31 కార్యాలయాలకు స్థలాల కోసం దరఖాస్తు చేసుకోగా ప్రభుత్వం రెండు దశల్లో భూములను కేటాయించింది. వరంగల్ గ్రామీణ జిల్లా, హైదరాబాద్లో స్థలాలఎంపిక జరగలేదు. ఖమ్మం, వనపర్తి మినహా మిగిలిన 29 జిల్లాల్లో సోమవారం శంకుస్థాపనకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఒక్కో జిల్లా కార్యాలయానికి రూ.60 లక్షల చొప్పున పార్టీ అధిష్ఠానం కేటాయించింది. అన్ని కార్యాలయాలు ఒకే నమూనాతో నిర్మించనున్నారు.