మహేష్ సినిమాకు బడ్జెట్ సమస్య ?

సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా బడ్జెట్ మీద మల్లగుల్లాలు జరుగుతున్నాయని తెలుస్తోంది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో మహేష్26 ఫిక్సయింది. ‘సరిలేరు నీకెవ్వరు’ టైటిల్ ని ఖరారు చేశారు. రష్మిక మందనని హీరోయిన్ గా తీసుకొన్నారు. లేడీ సూపర్ స్టార్ విజయశాంతిని కీలక పాత్ర కోసం ఒప్పించారు. సినిమా ప్రారంభోత్సవం జరిగింది. ఇక సెట్స్ మీదకు వెళ్లడమే ఆలస్యం.

ఇలాంటి సమయంలో సినిమా బడ్జెట్ పై మల్లగుల్లాలు జరుగుతున్నాయి. ఈ సినిమా నాన్ థియేటర్ రైట్స్ రూపంలో వచ్చే మొత్తం అంతా మహేష్ బాబు రెమ్యూనిరేషన్ కిందకే వెళ్తుంది. అది సుమారు 52 కోట్ల వరకు వుంటుందని అంచనా. ఇక మిగిలిన థియేటర్ రైట్స్ లోంచి ప్రొడక్షన్ కాస్త పోనూ లాభాలు రావాలి. ప్రొడక్షన్ కాస్ట్ ముందుగా రూ. 60 నుంచి 70కోట్లు అవుతుందని అంచనా వేశారు. ఇప్పుడీ అది రూ. 90కోట్ల వరకు తేలినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో నిర్మాతల్లో ఒకరైన దిల్ రాజు ఆలోచనలో పడ్డారు.

ఈ విషయంపై దిల్ రాజు మహేష్ తో సమావేశమై చర్చించినట్లు తెలుస్తోంది. ఇంకా చర్చలు కొనసాగుతున్నాయి. అవి పూర్తయితే.. సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. వచ్చే యేడాది సంక్రాంతి ‘సరిలేరు నీకెవ్వరు’ ప్రేక్షకుల ముందుకు రానుంది.