అందుకే ‘ప్రజా దర్బార్’ రద్దు


ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజా సమస్యలని తెలుసుకొనేందుకు ‘ప్రజా దర్బార్’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. జులై1 నుంచే ఈ కార్యక్రమం ప్రారంభం అవుతుందని ప్రభుత్వం ప్రకటించింది. ఐతే, చివరి నిమిషంలో ఈ కార్యక్రమాన్ని ఆగస్టు1కి వాయిదా వేసింది. ప్రజాదర్బార్‌ నిర్వహించాల్సిన కార్యాలయ పనులు ఇంకా పూర్తికాకపోవడం, అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాల నేపథ్యంలో ప్రజాదర్బార్‌ను వాయిదా వేశారు.

ఈ విషయం తెలియక.. రాష్ట్ర నలుమూలల నుంచి ప్రజలు ఈ ఉదయమే క్యాంపు కార్యాలయానికి తరలివచ్చారు. ప్రజాదర్బార్‌ వాయిదా పడిన విషయాన్ని తెలుసుకున్న ప్రజలు నిరాశతో వెనుదిరుగుతున్నారు. ప్రజాదర్బార్‌ వాయిదా పడినప్పటికీ.. ముఖ్యమంత్రి అర్జీలు స్వీకరిస్తారనే ప్రచారంతో ప్రజలు పెద్దఎత్తున అక్కడికి తరలివచ్చారు. ఈ సమయంలో తోపులాట చోటుచేసుకుంది. చివరికి వీరిని ముఖ్యమంత్రిని కలిసేందుకు లోనికి పంపించారు.

మరోవైపు, సీఎస్ఆర్ కల్యాణమండపంలో నిర్వహించిన సహస్ర చండీ యాగంలో సీఎం జగన్ పాల్గొన్నారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షిస్తూ ఈ యాగాన్ని జరిపించారు. యాగం అనంతరం సీఎం సచివాలయానికి వెళ్లారు.