ఉయ్యాలవాడ కుటుంబాలకు రామ్ చరణ్ అన్యాయం చేశాడా ?


‘ఉయ్యాలవాడ నరసింహారెడ్డి’ – తొలితరం స్వాతంత్య్ర సమరయోధుడు. ఆంగ్లేయులని గడగడ వణికించిన యోధుడు. ఇప్పుడీ యోధుడి జీవితగాథ సినిమాగా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవి151వ సినిమా ‘సైరా’గా రాబోతుంది. ఈ చిత్రానికి సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. బిగ్ బీ అమితాబ్ బచ్చన్, నయనతార, విజయ్ సేతుపతి, జగపతిబాబు, కిచ్చ సుధీప్, అనుష్క, తమన్నా తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీపై రామ్ చరణ్ నిర్మిస్తున్నారు. గాంధీ జయంతి కానుకగా అక్టోబర్ 2న ‘సైరా’ ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇటీవలే ‘సైరా’ షూటింగ్ పూర్తి చేసుకొంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఇలాంటి సమయంలో ‘సైరా’ విషయంలో వివాదం మొదలైంది. ఉయ్యాలవాడ కుటుంబ సభ్యులు రోడ్డుకెక్కారు. హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లోని కొణిదెల ప్రొడక్షన్స్‌ కార్యాలయం ముందు ఆదివారం ఆందోళనకు దిగారు. ఉయ్యాలవాడ సినిమాని ప్రారంభించిన సమయంలో తమకు న్యాయం చేస్తానని రామ్ చరణ్ మాటిచ్చారు. ఇప్పుడీ ఆ మాటని తప్పుతున్నారు. శనివారం మేనేజర్‌ అభిలాష్‌ ఫోన్‌ చేసి కథపై మీకు ఎలాంటి హక్కులు లేవని, కార్యాలయానికి రావద్దని చెప్పారని వారు ఆందోళన వ్యక్తం చేశారు. జూబ్లీహిల్స్‌ ఎస్సై బాలకృష్ణారెడ్డి వారికి నచ్చజెప్పే అక్కడి నుంచి పంపించారు. దీంతో వివాదం తాత్కాలికంగా సద్దుమణిగింది.

మరోవైపు,ఉయ్యాలవాడ కుటుంబసభ్యులు ఇప్పటికే రెండుసార్లు కోర్టును ఆశ్రయించారని, కోర్టు ఆదేశాల ప్రకారం తాము నడుచుకునేందుకు సిద్ధంగా ఉన్నామని సైరా వర్గాలు అంటున్నారు. ఫైనల్ గా రామ్ చరణ్ ఉయ్యాలవాడ కుటుంబాలకి న్యాయం చేస్తాడా ? లేదా ?? వారి ఆందోళనల మధ్యనే సినిమా విడుదల చేసే సాహాసం చేస్తారా ??? అనేది చూడాలి.