బుమ్రా @100 రికార్డ్


టీమిండియా ఫాస్ట్ బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రా సెంచరీ చేశాడు. అది కూడా సాదాసీదా సెంచరీ కాదు. రికార్డ్ సెంచరీ. బుమ్రా వన్డేల్లో 100 వికెట్ల క్లబ్‌లోకి చేరాడు. ప్రపంచకప్‌లో శ్రీలంకతో జరుగుతున్న మ్యాచ్‌లో ఇన్నింగ్స్‌ 4వ ఓవర్‌లో నాలుగో బంతికి కరుణరత్నె(10)ను పెవిలియన్‌కు పంపి బుమ్రా ఈ ఘనత సాధించాడు. దీంతో అతి తక్కువ వన్డేల్లో వంద వికెట్లు తీసిన రెండో భారతీయ బౌలర్‌గా బుమ్రా రికార్డు సృష్టించాడు.

బుమ్రా కంటే ముందు మహ్మద్‌ షమి ఉన్నాడు. షమి 56 వన్డేల్లో వంద వికెట్లు పడగొట్టాడు. బుమ్రా 57 వన్డేల్లో ఈ ఘనతని సాధించాడు. తర్వాత స్థానాల్లో ఇర్ఫాన్‌ పఠాన్‌(59 వన్డేల్లో), జహీర్‌ ఖాన్‌(65), అజిత్‌ అగర్కార్‌(67), జవగళ్‌ శ్రీనాథ్‌(68) ఉన్నారు. ఇక అంతర్జాతీయంగా చూసుకుంటే తక్కువ వన్డేల్లో వంద వికెట్లు పడగొట్టిన బౌలర్‌గా అఫ్గాన్‌ స్పిన్‌ సంచలనం రషీద్‌ ఖాన్(44 వన్డేల్లో) అందరికంటే ముందు వరుసలో ఉన్నాడు.