సంగీత దర్శకుడిగా సిద్ శ్రీరాం
యువ గాయకుడు సిద్ శ్రీరాం సంగీత దర్శకుడిగా కెరీర్ ప్రారంభించనున్నారు. మణిరత్నం శిష్యుడు ధనశేఖరన్ దర్శకత్వంలో ‘వానం కొట్టట్టుం’ అనే సినిమా తెరకెక్కుతోంది. ఈ చిత్రాన్ని మణిరత్నం నిర్మాణ సంస్థ మెడ్రాస్ టాకీస్ నిర్మిస్తోంది. ఈ చిత్రంతో సిద్ శ్రీరాం సంగీత దర్శకుడిగా పరిచయం కానున్నారు.
ఒకప్పుడు మణిరత్నం దర్శకత్వంలోని సినిమాలకు ఇళయరాజా సంగీతం సమకూర్చేవారు. అయితే ‘రోజా’ సినిమాలో ఏఆర్ రెహ్మాన్‌ను పరిచయం చేసి.. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయనతోనే ప్రయాణం చేస్తున్నారు. తన మెడ్రాస్ టాకీస్ నిర్మాణ సంస్థలో తెరకెక్కే సినిమాల్లో మాత్రం ఇతర సంగీత దర్శకులకు అవకాశం ఇస్తున్నారు. ఇప్పుడీ ఈ సంస్థ ద్వారా సిద్ శ్రీరాంని సంగీత దర్శకుడిగా పరిచయం చేస్తున్నారు మణి.
తమిళంలో ‘ఎన్నోడు నీ ఇరుందాల్’ (ఐ), ‘కురుంబా కురుంబా..’ (టిక్ టిక్ టిక్), ‘కన్నాన కన్నే..’ (విశ్వాసం) వంటి పాటలతో అందర్నీ ఆకట్టుకున్నారు సిద్ శ్రీరాం. తెలుగులో ‘ఉండిపోరాదే..’ వంటి పలు హిట్ పాటలతో యువతను ఆకట్టుకున్నారు. ఏఆర్ రెహ్మాన్ నుంచి అనిరుధ్ వరకు పలువురి సంగీతంలో పాటలు పాడారు.