టీమిండియా ఓటమికి అంపైర్ల నిర్లక్ష్యమే కారణమా ?
సెమీస్‌లో ధోనీ, జడేజా అద్భుత పోరాటంతో జట్టును విజయపు అంచుల వరకు తీసుకువెళ్లారు. కానీ ఆఖర్లో ధోనీ రనౌటవ్వడంతో ప్రపంచకప్‌లో భారత్ కథ ముగిసింది. 18 పరుగుల తేడాతో టీమిండియా ఓడిన సంగతి తెలిసిందే. ఐతే, టీమిండియా ఓటమికి అంపైర్ల నిర్లక్ష్యం ఓ కారణమని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. దానికి సంబంధించిన రుజువుని కూడా చూపిస్తున్నారు. ధోనీ రనౌట్ అయిన బంతి నో బాల్ అని అభిమానులు సామాజిక మాధ్యమాల్లో కామెంట్లు చేస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో చక్కర్లు కొడుతుంది.
భారత్ విజయానికి 10 బంతుల్లో 25 పరుగులు అవసరం. ధోనీ క్రీజ్‌లో ఉండగా ఫెర్గూసన్ బౌలింగ్ చేశాడు. బంతిని స్క్వేర్‌లెగ్ వైపుకు తరలించిన ధోనీ రెండో పరుగు కోసం ప్రయత్నించి రనౌటయ్యాడు. అయితే ఈ సమయంలో న్యూజిలాండ్ ఆరుగురు ఫీల్డర్లు అంతరవృత్తం అవతల ఉన్నారు. అది నోబాల్ అని అంపైర్ ప్రకటించి ఉంటే ధోనీ రెండు పరుగుల కోసం ప్రయత్నించేవాడు కాదు. దీంతో రనౌటయ్యే వాడు కాదు. అంపైర్ల నిర్లక్ష్యం టీమిండియాకు ప్రపంచకప్ ని దూరం చేసిందని అభిమానులు మండిపడుతున్నారు.