దర్జాగా ఫైనల్‌కు చేరిన ఇంగ్లాండ్‌

ఇంగ్లాండ్‌ దర్జాగా ఫైనల్‌కు చేరుకుంది. గురువారం ఆస్ట్రేలియాతో జరిగిన సెమీఫైనల్లో 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్‌ చేసిన ఆసీస్‌ 49 ఓవర్లలో 223 పరుగులకే ఆలౌటైంది.

స్మిత్‌ (85; 119బంతుల్లో 6×4), కారీ (46; 70బంతుల్లో 4×4) మినహా మిగతా బ్యాట్స్‌మెన్‌ విఫలయ్యారు. ఇంగ్లాండ్‌ బౌలర్లలో వోక్స్, రషీద్‌ చెరో మూడు వికెట్లు పడగొట్టగా, ఆర్చర్ రెండు వికెట్లు తీశాడు.

224 పరుగుల లక్ష్యాన్ని ఆడుతూ పాడుతూ చేధించింది. ఓపెనర్లు రాయ్‌ (85; 65బంతుల్లో 9×4, 5×6), బెయిర్‌స్టో (34; 43బంతుల్లో 5×4) మెరుపు ఆరంభం ఇచ్చారు. లాంఛనాన్ని రూట్‌ (49నాటౌట్‌; 46 బంతుల్లో 8×4), మోర్గాన్‌ (45; 39 బంతుల్లో 8×4) పూర్తి చేశారు. దీంతో ఇంగ్లాండ్‌ 32.1 ఓవర్లలో కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది.

లార్డ్స్‌ వేదికగా ఇంగ్లాండ్‌, న్యూజిలాండ్‌ మధ్య ఆదివారం ఫైనల్‌ మ్యాచ్‌ జరగనుంది. దీంతో ఈసారి వన్డే ప్రపంచకప్‌ ఛాంపియన్‌గా కొత్త జట్టు అవతరించనుంది.