జగపతి బాబు మేటరు తేల్చేశారు.. !

సీనియర్ నటుడు జగపతి బాబు సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా ‘సరిలేరు నీకెవ్వరు’ని డ్యామేజ్ చేసేలా కనిపించాడు. ఈ సినిమా కోసం తీసుకొన్న కీలక నటుల్లో జగపతిబాబు ఒకరు. ఆయన పాత్ర చాలా బాగుంటుందని దర్శకుడు అనిల్ రావిపూడి సన్నిహితుల దగ్గర చెప్పాడట. ఐతే, ఈ సినిమా నుంచి జగపతి బాబు సడెన్ గా తప్పుకొని షాక్ ఇచ్చారు. దానికి కారణం ఆయనకి సరిలేరు నీకెవ్వరు కథ నచ్చలేదనే ప్రచారం జరిగింది.

అదే సమయంలో సరిలేరు నీకెవ్వరు ఓ మిక్షర్ పొట్లం. పోకిరి+దూకుడు=సరిలేరు నీకెవ్వరు అనే ప్రచారం మొదలైంది. దీంతో కథ నచ్చకే జగపతి తప్పుకున్నాడనే ప్రచారానికి మరింత బలం చేకూరింది. తాజాగా ఈ ప్రచారం పై దర్శకుడు అనిల్ రావిపూడి క్లారిటీ ఇచ్చాడు. ట్విట్టర్ వేదిక ఓ చిన్నిపాటి నోట్ స్కీన్ షాట్ ని షేర్ చేశాడు. అందులో ఏముందంటే.. ?

“జగపతి బాబుగారు ‘సరిలేరు నీకెవ్వరు’లో నటించడానికి చాల ఆసక్తి చూపారు. ఈ సినిమాలో ఆయన తన పాత్రను ప్రేమించారు కూడా. అయితే కొన్ని కారణాల వల్ల.. ఆయన ఈ సినిమాలో నటించడం లేదు. కానీ భవిష్యత్తులో ఆయనతో కలిసి పని చేయాలని కోరుకుంటున్నాను. ఈ విషయంలో జగపతి బాబుగారు మమ్మల్ని అర్ధం చేసుకున్నందుకు కృతజ్ఞతలు” అంటూ రాసుకొచ్చారు అనిల్.

అనిల్ ట్విట్ కు జగపతి రిప్లై ఇచ్చారు. క్లారిటీ ఇచ్చినందుకు థ్యాంక్స్ చెప్పారు. దాంతో పాటు మరింత క్లారిటీ ఇస్తూ.. ఓ వీడియోని పోస్ట్ చేశారు జగపతి. ‘ఈ సినిమా కథ నాకు బాగా నచ్చింది. ఈ సినిమా కోసం మరో రెండు సినిమాలని వదులుకోవడం కూడా నిజం. కానీ, కొన్ని పరిస్థితుల వల్ల, కొన్ని కొన్ని జరుగుతుంటాయి. దాని వలన సినిమా నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. చిత్రబృందానికి ఆల్ ది బెస్ట్’ అన్నారు జగపతి. మొత్తానికి అనిల్, జగపతి ఇద్దరు సరిలేరు నీకెవ్వరు పుకార్లపై ఫుల్ క్లారిటీ ఇచ్చేశారు. జగపతి మేటర్ ని తేల్చేశారంతే !