ఆశలు వదిలేసుకొన్న సీఎం
కర్ణాటకలో కుమారస్వామి ప్రభుత్వం ఐసీయూలో ఉంది. ఏ క్షణానైనా కూలిపోవచ్చు. ఐతే, చివరి క్షణాల్లో భాజాపా తీరుని గట్టిగా ఎండిగట్టారు సీఎం కుమారస్వామి. సంకీర్ణ ప్రభుత్వం ఆధిక్యాన్ని నిరూపించుకునేందుకు గురువారం ప్రవేశపెట్టిన విశ్వాస తీర్మానంపై రెండో రోజు చర్చ జరుగుతోంది. శుక్రవారం సభ ప్రారంభమైన తర్వాత విశ్వాస తీర్మానంపై చర్చ ప్రారంభించాలని స్పీకర్ సీఎంను కోరారు. ఈ సందర్భంగా కుమారస్వామి మాట్లాడుతూ.. మరోసారి భాజపాపై ధ్వజమెత్తారు.
“యావత్ దేశం ఇప్పుడు కర్ణాటక రాజకీయ పరిణామాలను చూస్తోంది. ఈ ప్రభుత్వం 14 నెలల తర్వాత చివరి అంకానికి చేరుకుంది. నేనెప్పుడూ అధికారం కోసం భాజపా వద్దకు వెళ్లలేదు. వారే నా దగ్గరకు వచ్చారు. ఇప్పుడు కూడా కాంగ్రెస్ కోరడం వల్లే సీఎంగా బాధ్యతలు చేపట్టాను. ప్రతి సంకీర్ణంలోనూ విభేదాలు సహజం. కానీ సంకీర్ణ ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని భాజపా తరచూ కుట్రలు పన్నుతోంది. మీకు ఈ సీటు కావాలంటే తీసుకోండి” అన్నారు. కుమార తీరుని చూస్తుంటే ప్రభుత్వం నిలబెడుతుందన్న ఆశలు వదిలేసుకొన్నట్టు అర్థమవుతోంది.