చంద్రబాబుకు వైసీపీ ఎమ్మెల్యే వార్నింగ్ !


అసెంబ్లీ సాక్షిగా ఏపీ మాజీ ముఖ్యమంత్రి, తెదేపా అధినేత చంద్రబాబు నాయుడుకు వార్నింగ్ ఇచ్చారు వైకాపా ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌ రెడ్డి. ‘ఖబడ్దార్‌ చంద్రబాబు’ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గతంలో తాము ప్రతిపక్షంలో ఉండగా కనీసం తమ గోడు చెప్పుకునేందుకు కూడా అవకాశం కల్పించలేదని.. తాము ఆందోళన చేస్తే బయటకు గెంటేశారని అన్నారు. ప్రభుత్వాన్ని అప్రతిష్ఠ పాలు చేస్తే ఖబడ్దార్‌ అంటూ కోటం రెడ్డి శాసనసభలో పదేపదే వ్యాఖ్యలు చేశారు.

ఎస్సీ ఎస్టీ, బీసీలకు నామినేటెడ్ పదవులు, పనుల్లో 50 శాతం మేర రిజర్వేషన్లను కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను ప్రతిపక్ష తెదేపా జీర్ణించుకోలేకపోతోందని కోటంరెడ్డి ఆరోపించారు. మరోవైపు, ఏపీ అసెంబ్లీలో తొలి సస్పెన్షన్ జరిగింది. ముగ్గురు టీడీపీ సభ్యులు నిమ్మల, అచ్చెన్నాయుడు, బుచ్చయ్య చౌదరిలని సస్పెండ్ చేశారు. బడ్జెట్ సమావేశాలు పూర్తయ్యేవరకు వీరి సస్పెన్షన్ కొనసాగనుంది.