పూరికి ‘నో’, కొరటాలకు ‘ఎస్’ చెప్పిన కామ్రేడ్ !


స్టార్ హీరోలని మించిన క్రేజ్ ని సంపాదించుకొన్నాడు యంగ్ హీరో విజయ్ దేవరకొండ. పెళ్లి చూపులు, అర్జున్ రెడ్డి, గీత గోవిందం, టాక్సీవాలా సినిమాలతో విజయాలు అందుకొన్నాడు. ఆయన తాజా చిత్రం ‘డియర్ కామ్రేడ్’. రష్మిక మందన కథాయిక. కొత్త దర్శకుడు భరత్ కమ్మ దర్శకత్వం వహించారు. దక్షిణాది అన్నీ బాషల్లో (తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ) ఈ వారం (జులై26)న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా ప్రమోషన్స్ పాల్గొన్న విజయ్ దేవరకొండ తన తదుపరి సినిమాలపై స్పందించారు.

పూరి, కొరటాల శివలతో సినిమా ఎప్పుడు ? అని అడిగితే.. పూరి జగన్నాథ్‌గారితో సినిమా ఇంకా ఏమీ అనుకోలేదు. ఆ ఆలోచన వస్తే తప్పకుండా చెబుతాం. కొరటాల శివగారితో చేయాలని ఉంది. ఆయన ప్రస్తుతం చిరంజీవి గారితో ఓ సినిమా చేస్తున్నారు. అది పూర్తయ్యాక ఇద్దరి వీలుని బట్టి ఆలోచించాలని అన్నారు. ఐతే, అభిమానులకి మాత్రం విజయ్ పూరి చేతిలో పడితే చూడాలని ఉంది. హీరోలని డిఫరెంట్ మేనరిజంతో చూపిస్తుంటాడు పూరి. ‘పోకిరి’గా మహేష్, ‘దేశముదురు’గా బన్నీ, ‘ఇడియట్’గా రవితేజ, ‘బుజ్జిగాడు’గా ప్రభాస్, ఇస్మార్ట్ శంకర్’గా రామ్ ని పూరి మలిచిన విధానం అద్భుతం. అందుకే పూరి చెక్కిన విజయ్ ని చూడాలన్నది ఫ్యాన్స్ ఆశ.