సీఎంగా యడియూరప్ప నాలుగోసారి.. !


యడియూరప్ప కర్ణాటక సీఎంగా మరోసారి ప్రమాణస్వీకారం చేశారు. రాజ్ భవన్ లో గవర్నర్‌ వాజుభాయి వాలా యడియూరప్పతో సీఎంగా ప్రమాణం చేయించారు. ఈ ప్రమాణస్వీకార కార్యక్రమానికి మాజీ సీఎం ఎస్‌.ఎం. కృష్ణ, భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావు, ఇతర భాజపా నేతలు, కార్యకర్తలు హాజరయ్యారు.

యడియూరప్ప సీఎంగా బాధ్యతలు చేపట్టడం ఇది నాలుగోసారి. తొలిసారిగా 2007 నవంబర్‌లో ఆయన సీఎంగా బాధ్యతలు చేపట్టారు. కేవలం నాలుగు రోజులే ఆ పదవిలో ఉన్నారు. 2008 అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా విజయంతో రెండోసారి సీఎం పగ్గాలు చేపట్టారు. అయితే, ఆయనపై అవినీతి ఆరోపణలు రావడంతో 2011లో తన పదవికి రాజీనామా చేశారు. భాజపాపై అలిగిన యడియూరప్ప 2012లో ఆ పార్టీకి రాజీనామా చేసి కర్ణాటక జనతాపక్ష పేరుతో కొత్త పార్టీ స్థాపించారు.

ఆ తర్వాత కాలంలో జనతాపక్ష పార్టీని బీజేపీలో విలీనం చేశారు. 2018 మే నెలలో జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా అతిపెద్ద పార్టీగా అవతరించడంతో గవర్నర్‌ ఆ పార్టీని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించారు. సంఖ్యాబలం లేకపోవడంతో రెండు రోజుల్లోనే రాజీనామా చేయాల్సి వచ్చింది. ఇక, ఈ నెల 31లో శాసనసభలో యడియూరప్ప బలం నిరూపించుకోవాల్సి ఉంది. ఆ తర్వాతే కేబినేత్ విస్త్రరణ ఉండనుంది.