బిగ్ బాస్ పై చిన్మయి ఫైర్


గాయని చిన్మయి శ్రీపాద లైంగిక వేధింపులు విషయంలో మహిళలకు అండగా నిలుస్తున్న సంగతి తెలిసిందే. ఆమె దక్షిణాదిన #మీటూ ఉద్యమాన్ని ప్రారంభించింది. తనకి ఎదురైన లైంగిక వేధింపులని ధైర్యంగా బయటపెట్టింది. ఇతరలు ఎదుర్కొన్న వేధింపులని సమాజం దృష్టికి తీసుకొచ్చింది. తాజాగా చిన్మయి ‘బిగ్‌బాస్’ తమిళ్ సీజన్‌ 3 కంటెస్టెంట్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు.

కమల్ హాసన్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ 3లో తమిళ నటుడు శరవణన్‌ పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. ‘నేను అమ్మాయిల్ని ముట్టుకోవచ్చన్న కారణంతోనే కాలేజీకి బస్సుల్లో వెళ్లేవాడిని’ అన్నారు. దాంతో కమల్‌ హాసన్‌తో పాటు అక్కడున్న ఇతర కంటెస్టెంట్లు, ప్రేక్షకులు చప్పట్లు కొడుతూ పగలబడి నవ్వుకున్నారు. ఈ ఎపిసోడ్‌ టీవీలోనూ ప్రసారమైంది.

ఈ నేపథ్యంలో చిన్మయి ఆ వీడియోను ట్విటర్‌లో పోస్ట్‌ చేస్తూ.. ‘అమ్మాయిల్ని ముట్టుకోవచ్చనే బస్సుల్లో ప్రయాణించేవాడినంటూ ఓ వ్యక్తి గర్వంగా చెప్పుకొంటున్న వీడియోను ఓ తమిళ ఛానల్‌ ప్రసారం చేసింది. పైగా అతని వ్యాఖ్యల పట్ల చప్పట్లు కొడుతూ నవ్వుకుంటున్న వారికి ఇది జోక్‌గా అనిపిస్తోందా?’ అని ట్వీట్‌లో పేర్కొన్నారు. చిన్మయిని సపోర్ట్ చేస్తూ చాలామంది కామెంట్స్ పెడుతున్నారు. మరీ.. దీనిపై బిగ్ బాస్ యాజమాన్యం, దానికి హోస్ట్ గా వ్యవహరిస్తున్న కమల్ హాసన్ ఏం సమాధానం చెబుతారో చూడాలి.