ముఖేష్ గౌడ్ ఇకలేరు


మాజీ మంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత ముఖేశ్‌గౌడ్‌ (60) కన్నుమూశారు. కొంతకాలంగా ఆయన కేన్సర్‌తో బాధపడుతున్న సంగతి తెలిసిందే. ఆదివారం రాత్రి 9 గంటల సమయంలో శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతుండటంతో కుటుంబసభ్యులు ఆయన్ని హైదరాబాద్ అపోలో ఆస్పత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ కొద్దిసేపటి క్రితమే ముఖేష్ గౌడ్ కన్నుమూశారు.

ముఖేష్ గౌడ్ జూలై 1,1959లో జన్మించారు. ఆయనకు ఇద్దరు కుమారులు విక్రమ్ గౌడ్, విశాల్ గౌడ్, ఒక కుమార్తె శిల్పా ఉన్నారు. కుమారుడు విక్రమ్ ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ లో కొనసాగుతున్నారు. గత 30 ఏళ్లుగా కాంగ్రెస్‌లో కొనసాగుతున్నారు. మాస్ లీడర్ గా గుర్తింపు పొందారు. మజ్లీస్ హవా మాత్రమే నడిచే హైదరాబాద్ పాతబస్తీలో జనహృదయం గెలిచిన ప్రజానాయకుడు ముఖేష్.

1989, 2004లో మహారాజ్‌గంజ్‌, 2009లో గోషామహల్‌ నుంచి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ తరఫున పోటీ చేసి విజయం సాధించారు. 2007లో బీసీ సంక్షేమశాఖ మంత్రిగా తొలిసారి బాధ్యతలు స్వీకరించారు. 2009లో మరోసారి మార్కెటింగ్‌ శాఖ బాధ్యతలను అయిదేళ్లపాటు నిర్వర్తించారు. 2014, 2018లలో గోషామహల్‌ నుంచి పోటీ చేసి భాజపా అభ్యర్థి రాజాసింగ్‌ చేతిలో ఓటమి పాలయ్యారు.