రస్మిక అడ్డంగా దొరికిపోయింది


‘ఛలో’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది కన్నడ భామ రష్మిక మందన. తొలి సినిమాతోనే తెలుగు ప్రేక్షకులని బుట్టలో వేసుకొంది. ఆ తర్వాత ‘గీత గోవిందం’తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకొంది మేడమ్. ఈ హిట్ తో స్టార్ కాబోయే స్టార్ హీరోయిన్ అనిపించుకొంది. అందుకు తగ్గట్టుగానే అవకాశాలని దక్కించుకుంటోంది. విజయ్ దేవరకొండతో మరోసారి డియర్ కామ్రేడ్ కోసం జతకట్టింది. ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చిన కామ్రేడ్ మిక్సిడ్ టాక్ ని తెచ్చుకొంది. అయినా.. రస్మిక నటనకు ప్రశంసలు కురుస్తున్నాయ్. ఈ జోష్ లో నోరు జారింది రస్మిక. కన్నడ ప్రేక్షకుల ఆగ్రహానికి గురైంది.

‘డియర్ కామ్రేడ్’ ప్రమోషన్స్ లో పాల్గొన్న రస్మికకు మీకు ఏ బాషలో నటించడం కష్టం అనిపిస్తోంది ? అనే ప్రశ్న ఎదురైంది. దీనికి రస్మిక ఏమాత్రం ఆలోచించకుండా కన్నడ బాషలో నటించడం కష్టం అనిపిస్తోంది అంది. రస్మిక సమాధానంపై కన్నడ ప్రేక్షకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మాతృ బాషలో ఇబ్బందిపడుతున్నానని చెప్పడమేంటని సోషల్ మీడియా వేదికగా రస్మికపై ఓ రేంజ్ లో ఫైర్ అవుతున్నారు. రస్మిక ప్రస్తుతం మహేష్ ‘సరిలేరు నీకెవ్వరు’లో నటిస్తోంది. దీంతోపాటు నితిన్ భీష్మలోనూ రస్మిక నటిస్తోంది. ఇవీగాక మరో మూడ్నాలుగు సినిమాలని లైన్’లో పెట్టిందట.