‘ఇస్మార్ట్ శంకర్’ వాళ్లకి అంకితం !

వరుస ప్లాపుల్లో ఉన్న రామ్ ‘నేను శైలజా’తో హిట్ కొట్టాడు. ఈ సినిమాలో కొత్తగా కనిపించాడు. తన ఎనర్జిని అంతా పక్కన పెట్టేసి పాత్రలో లీనమైపోయాడు. దానికి ఫలితం దక్కింది. నేను శైలజా సూపర్ హిట్టయింది. ఇక రామ్ మళ్లీ హిట్ ట్రాక్ లోకి వచ్చేసినట్టే అనుకొన్నారంతా. కానీ, ఆ తర్వాత రామ్ మళ్లీ పాత దారిలోకి వెళ్లి హైపర్ సినిమా చేశాడు. అది అట్టర్ ప్లాప్. ఇక రామ్ మారడు అనుకొన్నారు. నిజంగానే రామ్ ఏమాత్రం మారలేదు. పైగా ‘ఇస్మార్ట్ శంకర్’ కోసం తన ఎనర్జిని డబుల్ చేశాడు. అది ప్రేక్షకులకి కిక్కునిచ్చింది. ఇస్మార్ట్ శంకర్ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఐతే, ఈ సినిమా సక్సెస్ ని రామ్ పూర్తి స్థాయిలో ఎంజాయ్ చేయలేకపోయాడు. సినిమా రిలీజ్ కాగానే ఫ్యామిలితో కలిసి ఫారిన్ టూర్ కి వెళ్లడమే ఇందుకు కారణం.

తిరిగొచ్చాక మాత్రం రామ్ కోసం ప్రత్యేకంగా సక్సెస్ మీట్ లని ఏర్పాటు చేసింది చిత్రబృందం. శనివారం జరిగిన ఇస్మార్ట్ శంకర్ సక్సెస్ మీట్ లో అభిమానులని ఫిదా చేశాడు రామ్. ‘నా జయాపజయాలతో సంబంధం లేకుండా నన్ను ఎప్పటికీ ప్రేమిస్తున్న నా అభిమానులందరికీ ‘ఇస్మార్ట్‌ శంకర్‌’ను అంకితమిస్తున్నా’నని ప్రకటించారు. ‘ఈ సినిమా చూస్తున్నప్పుడు నాకే చాలా కిక్‌ వచ్చింది. మంచి అబ్బాయి పాత్రలు చేసి బోర్‌ కొట్టింది. దానికి భిన్నమైన పాత్ర చేయాలనుందని పూరిగారికి చాలాసార్లు చెప్పాను. నాకోసం ఆయన ఇస్మార్ట్‌ శంకర్‌ పాత్రని సృష్టించారు. ఈ సినిమా మరో పదేళ్ల పాటు గుర్తుండి పోతుంద’న్నారు రామ్.