తమన్నాకు తృప్తిగా ఉందట !


గ్లామర్ క్వీన్ తమన్నా. అందం, అభినయంలోనూ ఆమెకు వంకపెట్టలేం. కానీ ఆమెకు రావాల్సినంత పేరు రాలేదని చెబుతుంటారు. తెలుగు సినిమా ఖ్యాతిని పెంచిన ‘బాహుబలి’ క్రెడిట్ తమన్నా ఖాతాలో పడలేదు. ఈ సినిమా తర్వాత తమ్మూ ఆఫర్లు క్యూ కట్టలేదు. మరింత బిజీ కాలేదు. ప్రస్తుతం ‘సైరా నరసింహారెడ్డి’లో ఓ కీలక పాత్ర పోషించిందామె. అక్టోబరులో ఈ చిత్రం విడుదల కానుంది.

ఈ నేపథ్యంలో తమన్నా మాట్లాడుతూ.. “ప్రతిభకు, విజయానికీ ఎప్పుడైనా ఎక్కడైనా గుర్తింపు ఉంటుంది. ఓ వ్యక్తి ఎదుగుదలకు ఇవి రెండే కొలమానాలు. అయితే నేను సాధించిన విజయాల కన్నా, నా ప్రతిభ కన్నా నాకెక్కువ గుర్తింపు వచ్చింది. ప్రేక్షకులు అర్హతకు మించిన స్థానం ఇచ్చారు. నేనో రకంగా అదృష్టవంతురాల్ని. ఎందుకంటే జయాపజయాలకు అతీతంగా నాకు అభిమానులు ఏర్పడ్డారు. నా సినిమా సరిగా ఆడకపోయినా సరే, ‘ఇందులో మీరు బాగా నటించారు. ఇంకా అందంగా కనిపించారు’ అంటూ కితాబు ఇస్తుంటారు. అవి విన్నప్పుడు తృప్తిగా అనిపిస్తుంటుందని చెప్పుకొచ్చింది తమ్మూ.