కేంద్రం నెక్ట్స్ టార్గెట్ పీవోకే ?
భారత్‌లో కశ్మీర్ అంతర్భాగం. 370 అధికరణం రద్దు నిర్ణయాన్ని సువర్ణాక్షరాలతో లిఖించాల్సిన విషయం. ప్రధాని నరేంద్ర మోదీ సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారు. జమ్మూకశ్మీర్ ఎంత కాలం యూటీగా ఉంటుందనే సందేహం ఉంది. సాధారణ పరిస్థితులు నెలకొన్నాక రాష్ట్రంగా మారుతుందన్నారు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా. లోక్‌సభలో జమ్మూకశ్మీర్ పునర్విభజన బిల్లుపై చర్చలో అమిత్ షా మాట్లాడుతూ.. ఆర్టికల్ 370 వల్ల గత 70 ఏళ్లలో జమ్మూకశ్మీర్‌లో జరిగిన అభివృద్ధి ఏమిటని ప్రశ్నించారు. కశ్మీర్ నష్టపోయేందుకు కారణం ఆర్టికల్ 370యేనన్నారు. మా నిర్ణయం తప్పో, ఒప్పో భవిష్యత్తే నిర్ణయిస్తుందన్నారు.
పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే) కూడా భారత్‌లో అంతర్భాగమే. దాన్ని ఎలా స్వాధీనం చేసుకోవాలో మాకు తెలుసు అన్నారు అమిత్ షా. కశ్మీరీ ప్రజల కలలను కేంద్ర ప్రభుత్వం నెరవేరుస్తుంది. చర్చలకు మేమెప్పుడూ వెనుకడుగు వేయలేదు. సభలో చర్చలు లేకుండా బిల్లు ఆమోదిస్తున్నారని కొందరు విమర్శలు చేస్తున్నారు. పాకిస్థాన్ నుంచి ప్రేరణ పొందినవారితో చర్చలు జరపాలా? దేశంలో చిన్న పిల్లాడిని అడిగినా కశ్మీర్ భారత్‌లో అంతర్భాగమని చెబుతాడు. 70 ఏళ్లుగా వున్న సమస్యకు మేం పరిష్కారం చూపించాం. కశ్మీర్‌లో సమస్యలు క్రమంగా పరిష్కారమవుతాయని షా తెలిపారు.