చైనాకు భారత్ ధీటైన జవాబు
జమ్ముకశ్మీర్ పునర్విభజన పూర్తిగా మనదేశం సొంత వ్యవహారం. ఈ విషయంలో పొగురు దేశాల స్పందన ఏమాత్రం పట్టించుకోవాల్సిన పనిలేదు. ఐతే, జమ్ముకశ్మర్ విభజనపై ఇప్పటికే పాకిస్థాన్ విషం కక్కింది. దీనిపై ఐక్యరాజ్య సమితిలో ఫిర్యాదు చేస్తామని ఆ దేశ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రకటన చేశారు. భారత ప్రభుత్వ నిర్ణయాలపై చైనా లేటుగా స్పందించింది.
జమ్ముకశ్మీర్ అంశంపై ఏకపక్ష నిర్ణయాలకు భారత్ దూరంగా ఉండాలని, లద్దాఖ్‌ను కేంద్ర పాలిత ప్రాంతగా విడదీయడం అంగీకారయోగ్యం కాదని అసంతృప్తిని వ్యక్తం చేసింది. దీనికి భారత్ దీటుగా సమాధానమిచ్చింది. ఇది తమ అంతర్గత వ్యవహారమని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సూటిగా బదులిచ్చింది. తాము ఇతర దేశాల అంతర్గత వ్యవహారాల్లో వేలుపెట్టమని, ఇతర దేశాల నుంచి అదే కోరుకుంటామని స్పష్టం చేసింది.
ఇంతకీ జమ్ముకశ్మీర్ విభజనపై చైనా ఎందుకు స్పందించింది అంటే.. ? తన మిత్రదేశం పాకిస్థాన్ ప్రయోజనాలు, అలాగే చైనా-ఇండియా సరిహద్దులోని లద్దాఖ్‌లోని వివాదాస్పద అక్సాయ్‌చిన్ ప్రాంతం ఆ దేశం స్పందనకు కారణమయ్యాయి. భారత్ తనదిగా చెప్పుకుంటోన్న అక్సాయ్‌చిన్ ప్రాంతం ప్రస్తుతం చైనా నియంత్రణలోనే ఉంది.