లోధీ శ్మశాన వాటికలో సుష్మా అంత్యక్రియలు


కేంద్ర మాజీ మంత్రి, భాజపా సీనియర్‌ మహిళా నేత సుష్మా స్వరాజ్ గుండెపోటుతో హఠాన్మరణం చెందారు. మంగళవారం రాత్రి 10:30 సమయంలో సుష్మా తుదిశ్వాస విడిచారు. సుష్మ భౌతికకాయాన్ని మధ్యాహ్నం 12 గంటల ఆమె ఇంటి దగ్గర ఉంచనున్నారు. ఆ తర్వాత పార్టీ కార్యకర్తలు, నేతల సందర్శానార్థం ఢిల్లీలోని భాజపా ప్రధాన కార్యాలయానికి తరలించనున్నారు. అక్కడ మధ్యాహ్నం 12 గంటల నుంచి 3 గంటల వరకు ఉంచుతారు. సాయంత్రం ప్రభుత్వ లాంఛనాలతో సుష్మా అంత్యక్రియలు జరగనున్నాయి.

సుష్మా స్వరాజ్‌ భౌతికకాయానికి రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ నివాళులు అర్పించారు. యోగా గురువు బాబా రాందేవ్‌, లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా, భాజపా కార్యనిర్వాహక అధ్యక్షుడు జేపీ నడ్డా తదితరులు సుష్మా భౌతికకాయానికి నివాళులు అర్పించారు. భాజపా సీనియర్‌ నేత ఎల్‌కే అడ్వాణీ సుష్మా మృతిపట్ల సంతాపం తెలియజేశారు. దేశం ఒక విలక్షణ రాజకీయ నేతను కోల్పోయింది. సుష్మ స్వరాజ్‌లేని లోటు పూడ్చలేనిది. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలి. ఆమె కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తునన్నారు.