చిన్నమ్మ ఇకలేరు
తెలంగాణ ప్రజల ఆకాంక్షని నెరవేర్చడంలో కీలక పాత్ర పోషించిన చిన్నమ్మ సుష్మా స్వరాజ్ (67) ఇకలేరు. మంగళవారం రాత్రి సుష్మాకి తీవ్ర గుండెపోటుతో హఠాన్మరణం చెందారు. మంగళవారం రాత్రి 10.15 గంటల సమయంలో గుండెపోటు రావటంతో కుటుంబ సభ్యులు దిల్లీలోని అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ (ఎయిమ్స్)కు తరలించారు. ఆ వెంటనే ఎమర్జెన్సీ వార్డుకు మార్చారు. చికిత్స అందిస్తుండగానే ఆమె తుదిశ్వాస విడిచారు. ఆమెకు 2016లో మూత్రపిండ మార్పిడి జరిగింది. అనారోగ్య కారణాల రీత్యా ఇటీవలి సార్వత్రిక ఎన్నికల్లో సుష్మా పోటీ చేయలేదు. ఆమెకు భర్త స్వరాజ్ కౌశల్, కుమార్తె బన్సురి ఉన్నారు.
సుష్మా స్వరాజ్ ఆకస్మిక మృతి పట్ల రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు తీవ్ర దిగ్భ్రాంతిని, సంతాపాన్ని వ్యక్తం చేశారు. సుష్మాజీ అస్తమయంతో భారత రాజకీయాల్లో ఓ గొప్ప అధ్యాయం ముగిసిందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. ఆమె నిర్వహించిన ప్రతి మంత్రిత్వ శాఖలోనూ అత్యున్నత ప్రమాణాలను నెలకొల్పారు. వివిధ దేశాలతో భారత్ సంబంధాలను మెరుగుపరచడంలో కీలకపాత్ర పోషించారన్నారు. సుష్మాస్వరాజ్ మృతిపట్ల తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఏపీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. వివిధ హోదాల్లో ఆమె దేశానికి చేసిన సేవలను కొనియాడారు.