శ్రీశైలం నాలుగు గేట్లు ఎత్తివేత

శ్రీశైలం జలాశయం నిండుకుండలా మారింది. ఎగువన భారీ వర్షాలు కురవడంతో పూర్తిస్థాయి నీటి మట్టానికి చేరువైంది. మొత్తం నీటి మట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుతం 880 అడుగులు దాటింది. జలాశయం పూర్తిస్థాయి సామర్థ్యం 215.81 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 189.89 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఈ నేపథ్యంలో నాలుగు గేట్లను ఎత్తివేశారు. దీంతో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతూ నాగార్జున సాగర్‌వైపు పరుగులు పెడుతోంది. ఈ నాలుగు గేట్ల ద్వారా దాదాపు లక్ష క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు.

తొలుత 6వ నెంబర్‌ గేటను ఎత్తారు. ఆ తర్వాత 7, 8, 9 ఒక్కో గేటును 10 అడుగుల మేర ఎత్తారు. ఒక్కో గేటు నుంచి 25వేల క్యూసెక్కుల చొప్పున అధికారులు నీటిని విడుదల చేశారు. పండుగ వాతావరణం, సందర్శకుల కోలాహలం మధ్య ఈ గేట్లు తెరుచుకున్నాయి. ఏపీ మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్‌, తెలంగాణ మంత్రులు నిరంజన్‌ రెడ్డి, శ్రీనివాస్‌ గౌడ్‌ కృష్ణమ్మకు పూజలు నిర్వహించిన అనంతరం గేలు ఎత్తారు. ఈ సుందర దృశ్యాలను వీక్షించేందుకు సందర్శకులు భారీ సంఖ్యలో తరలివచ్చారు.