టీమిండియా కోచ్‌ పదవి.. 6గురితో తుది జాబితా !


టీమ్‌ఇండియా ప్రధాన కోచ్‌ పదవి కోసం షార్ట్ లిస్ట్ రెడీ అయింది. ఆరుగురితో తుది జాబితాను సిద్ధం చేసినట్లు తెలిసింది. ఈ జాబితాలో రవిశాస్త్రితో పాటు టామ్‌ మూడీ, మైక్‌ హెసన్‌, ఫిల్‌ సిమన్స్‌, రాబిన్‌ సింగ్‌, లాల్‌చంద్‌ రాజ్‌పుత్‌ లు ఉన్నట్టు తెలుస్తోంది. వీరిని మాత్రమే ఇంటర్వ్యూలకు పిలవనున్నారట. ముంబయిలోని బీసీసీఐ ప్రధాన కార్యాలయంలోనే కపిల్‌ కమిటీ ఈ శుక్రవారమే ఇంటర్వ్యూలు నిర్వహించనుంది. ఇంటర్వ్యూలు పూర్తయిన రెండు మూడు రోజుల్లోపే కోచ్‌ ఎవరన్నది ప్రకటిస్తారని బీసీసీఐ వర్గాల సమాచారమ్.

రవిశాస్త్రే కోచ్‌గా కొనసాగాలని కోరుకుంటానని టీమ్‌ఇండియా కెప్టెన్‌ కోహ్లి ఇప్పటికే తన అభిప్రాయాన్ని తెలిపారు. ఐతే, కోచ్‌ ఎంపికలో కోహ్లి అభిప్రాయాల్ని కమిటీ పరిగణనలోకి తీసుకోదని, స్వతంత్రంగా వ్యవహరిస్తుందని బీసీసీఐ స్పష్టం చేసింది. టామ్‌ మూడీ, మైక్‌ హెసన్‌ల నుంచి రవిశాస్త్రికి గట్టి పోటీ ఎదురు కావచ్చని తెలుస్తోంది. ఇక, సహాయ కోచ్‌లు, ఇతర సిబ్బంది కోసం ఇంటర్వ్యూల్ని భారత క్రికెట్‌ సెలక్షన్‌ కమిటీ ఛైర్మన్‌ ఎమ్మెస్కే ప్రసాద్‌ నిర్వహించనున్నట్లు సమాచారమ్. అదెప్పుడు ? అన్నది ఇంకా నిర్ణయం కాలేదు.