వన్డే సిరీస్ కూడా టీమిండియాదే
విండీస్ తో వన్డే సిరీస్ ని కూడా క్లీన్ స్వీప్ చేసింది టీమిండియా. వర్షం కారణంగా మొదటి వన్డే రద్దయిన సంగతి తెలిసిందే. ఇక రెండో వన్ డే లో కెప్టెన్ విరాట్ కోహ్లీ, యువ బ్యాట్స్ మెన్ శ్రేయస్ అయ్యారు రాణించడంతో విండీస్ ని ఈజీగా ఓడించేసింది. గురువారం జరిగిన ఆఖరి వన్ డే లోనూ మళ్లీ వీరిద్దరే రాణించారు. విరాట్ కోహ్లీ(114*; 99 బంతుల్లో 14×4) మరో శతకంతో మెరవగా, శ్రేయస్ (65; 41బంతుల్లో 3×4, 5×6) అర్ధశతకంతో చెలరేగిన వేళ.. ఆఖరి వన్డేలో భారత్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
ముందుగా బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ 35 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 240 పరుగులు సాధించింది. ఓపెనర్లు క్రిస్ గేల్(72; 41బంతుల్లో 8×4, 5×6), లూయిస్(43; 29బంతుల్లో 5×4, 3×6) మెరిపించారు. వర్షం కారణంగా మ్యాచ్‌ను 35 ఓవర్లకు కుదించారు. డక్‌వర్త్ లూయిస్ ప్రకారం భారత్ లక్ష్యాన్ని 255 పరుగులుగా నిర్ధేశించారు. 32.3 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి కోహ్లీసేన లక్ష్యాన్ని ఛేదించింది. దీంతో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను భారత్ 2-0తో కైవసం చేసుకుంది.