అలర్ట్ : కశ్మీర్ లో ఉగ్రదాడులకి ఛాన్స్
ఆర్టికల్ 370రద్దు, రాష్ట్ర విభజన నేపథ్యంలో జమ్ముకశ్మీర్ లో కేంద్ర ప్రభుత్వం ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆంక్షలని సడలించింది. జమ్ములో పూర్తిగా ఆంక్షలు ఎత్తేశారు. కశ్మీర్ లోనూ త్వరలోనే ఆంక్షలు ఎత్తివేసేందుకు కేంద్రం రెడీ అవుతోంది. మరోవైపు కశ్మీర్ పై కేంద్రం తీసుకొన్న నిర్ణయంపై పాకిస్థాన్ భగ్గుమంటోంది. భారత్ కి సంబంధించిన వాటిని బ్యాన్ చేస్తోంది. ఈ నేపథ్యంలో.. కశ్మీర్ లోయలో పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు పలు చోట్ల దాడులు చేసే అవకాశం ఉందని నిఘా వర్గాలు హెచ్చరించాయి. ఈ మేరకు ఉన్నతాధికారులు కశ్మీర్‌లో భద్రతా బలగాలను అప్రమత్తం చేశారు.
జమ్ము, కశ్మీర్‌లో ఆర్మీ, వైమానిక స్థావరాలపైనా దాడులు జరిగే అవకాశం ఉందనే సమాచారం నేపథ్యంలో నిరంతరం అప్రమత్తంగా ఉండాలని భద్రత, వైమానిక దళాలకు సూచించారు. జమ్ము, కశ్మీర్‌లలో అలజడులు సృష్టించి తద్వారా ఆ ప్రాంతంలో అశాంతి నెలకొనేలా చేయాలని ప్రయత్నిస్తోంది. ఇప్పటికే పలు చోట్ల ఉగ్ర చొరబాట్లను భద్రతా దళాలు భగ్నం చేసిన సంగతి తెలిసిందే. తాజా నిఘా వర్గాల హెచ్చరికలతో కశ్మీర్ లో భద్రతాదళాలని అలర్ట్ చేశారు.