మాజీ మంత్రి కొత్తపల్లి కుమారుడు మృతి

మాజీ మంత్రి, వైసీపీ నేత కొత్తపల్లి సుబ్బారాయుడు ఇంట్లో విషాదం చోటు చేసుకొంది. ఆయన చిన్న కుమారుడు నారాయణ రాయుడు (35) మృతి చెందారు. నారాయణ రాయుడు పుట్టుకతోనే మానసికలోపంతో బాధపడుతున్నాడు. అయినా ఆయన్ని కంటికి రెప్పలా కాపాడుకొంటూ వస్తున్నారు. సుబ్బారాయుడు సతీమణి పూర్తి సమయాన్ని కొడుకు కోసమే కేటాయించేవారు.

ఆదివారం మధ్యాహ్నం వీల్‌చైర్‌లో ఉన్న నారాయణ రాయుడు ఒక్కసారి కుప్పకూలిపోయాడు. అతడిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించినా ఫలితం లేకపోయింది. అప్పటికే నారాయణ చనిపోయినట్టు వైద్యులు నిర్ధారించారు. శాసనమండలి చైర్మన్‌ ఎండీ షరీఫ్, ఎమ్మెల్యేలు ముదునూరి ప్రసాదరాజు, జక్కంపూడి రాజా, మాజీ మంత్రి పితాని సత్యనారాయణ, మాజీ ఎమ్మెల్యేలు బండారు మాధవనాయుడు, కొత్తపల్లి జానకిరామ్, తదితరులు కొత్తపల్లి పరామర్శించారు.

కొత్తపల్లి తొలిసారి 1989లో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. నర్సాపురం నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా గెలుపొందారు. అప్పటి నుంచి ఆయన టీడీపీలోనే కొనసాగారు. 2009లో పీఆర్పీలో చేరారు. ఆ తర్వాత 2014లో వైసీపీలో చేరారు. ఆ తర్వాత మళ్లీ సొంతగూడు టీడీపీకి చేరారు. 2019ఎన్నికల ముందు మరోసారి కొత్తపల్లి వైసీపీ తీర్థం పుచ్చుకొన్నారు.