రాజమౌళి మాటలకి ప్రభాస్ కంటతడి !
ప్రభాస్-రాజమౌళి స్నేహబంధం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ‘బాహుబలి’ సినిమా కోసం ఐదేళ్లు కలిసి పనిచేశారు. ప్రభాస్.. రాజమౌళి కుటుంబ సభ్యుడిగా మారిపోయాడు. ఈ విషయాన్ని పలు సందర్భాల్లో రాజమౌళి సతీమణి రమా రాజమౌళి చెప్పారు. సాహో ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో సీనియర్ రెబల్ స్టార్ కృష్ణంరాజు ఇదే మాట చెప్పారు. రాజమౌళి ప్రభాస్ కి చాలా దగ్గరి మనిషి. ఆయన ఏం చెబితే అది చేస్తాడు. మాకు అత్యంత ఆప్తుడు. మా ఫ్యామిలీ మెంబర్ అని చెప్పాడు.
అలాంటి రాజమౌళి ‘సాహో’ గురించి మాట్లాడుతుంటే ప్రభాస్ ఎమోషన్ అయ్యాడు. ఇంతకీ రాజమౌళి ఏమన్నారంటే.. ? ప్రభాస్ కు దూరదృష్టి ఎక్కువ. ‘బాహుబలి’ సమయంలోనే ఈ సినిమా ఎలాగూ బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది. ఈ సినిమా తర్వాత ఎలాంటి సినిమా చేయాలని ఆలోచించేవాడు. ఒక రోజు ప్రభాస్ చాలా ఎక్సైటెడ్‌గా నా దగ్గరకు వచ్చాడు. సుజీత్ వచ్చి కథ చెప్పాడు డార్లింగ్.. అద్భుతంగా ఉంది అని చాలా చాలా ఆనందంగా చెప్పాడు.
నాకు మొదట నచ్చిన విషయం ఏంటంటే.. ఒక పెద్ద సినిమా చేసిన తరవాత ఇంకా పెద్ద డైరెక్టర్‌తో చేయాలి, ఇంకా పెద్ద సినిమా చేయాలి అని కాకుండా, కథను నమ్మి చేశాడు. ‘బాహుబలి’ తరవాత ఇలాంటి సినిమా అయితే జనాలకు నచ్చుతుంది, నా ఫ్యాన్స్‌కి నచ్చుతుంది అని నమ్మి చేశాడు. ఇదే ‘సాహో’కి ఒక మంచి సూచికం అన్నారు రాజమౌళి. ఆ సమయంలో ప్రభాస్ భాగోద్వేగానికి గురైనట్టు కనిపించింది.