అది పూరికే సాధ్యం.. !
పూరి జగన్నాథ్ స్పీడున్నోడు. 15రోజుల్లోనే కథని రాసేసి.. నెలరోజుల్లోనే సినిమాని సెట్స్ మీదకు తీసుకెళ్లి.. మూడు నెలల్లోనే సినిమాని పూర్తి చేసేంత స్పీడు పూరిది. ఇడియట్, పోకిరి.. ఇలా తీసినవే. ట్రెండ్ సెట్ చేశాయ్. ప్లాపుల్లో ఉన్న పూరి స్పీడు తగ్గించలేదు. ఒక్క ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాని మాత్రం కాస్త తాపీగానే తీశారు. హిట్ కొట్టారు. ఐతే, హిట్ కొట్టిన దర్శకులంతా తమ నెక్ట్స్ సినిమాని చాలా త్వరగా స్టార్ట్ చేస్తారు అనుకోవడానికి లేదు. ‘గీత గోవిందం’ బ్లాక్ బస్టర్. కానీ డైరక్టర్ పరుశురామ్ సినిమా ఇఫ్పటి వరకు పట్టాలు ఎక్కలేదు. భరత్ అనే నేను సూపర్ హిట్. కానీ కొరటాల శివ సినిమా ఇంకా స్టార్ట్ కాలేదు.
రంగస్థలం సూపర్ డూపర్ హిట్. అయినా సుకుమార్ సినిమా అనేది ఎప్పుడో ఎవరికీ తెలియదు. భాగమతి హిట్ సినిమా. డైరక్టర్ అశోక్ ఏం చేస్తున్నారో తెలీదు. ఇలా చెప్పుకొంటూ పోతే చాలామందే ఉన్నారు. ఐతే, పూరి మాత్రం ‘ఇస్మార్ట్ శంకర్’ హిట్ తో విజయ్ దేవరకొండని పట్టేశాడు. డియర్ కామ్రేడ్ ముందు వరకు స్టార్ హీరోలని మించిన రేంజ్ విజయ్ ది. అలాంటి విజయ్ తో సినిమాని ఈజీగా సెట్ చేశాడు పూరి. త్వరలోనే సినిమాని సెట్స్ మీదకు తీసుకెళ్లనున్నాడు. తెలివిగా సినిమాని ఓకే చేయించుకోవడం.. చకచకా సినిమా చేయడం ఒక్క పూరికే సాధ్యం. అది.. హిట్టు-ప్లాపులతో సంబంధం లేకుండా!