టీమిండియాకు భద్రత పెంపు

ఆర్టికల్ 370రద్దు. కశ్మీర్ విభజనతో పాకిస్థాన్ రగిలిపోతుంది. ఈ నేపథ్యంలో భారత్ లో ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉందని ఇటీవలే ఇంటెలిజెన్స్ వర్గాలు పేర్కొన్నాయ్. ఈ నేపథ్యంలో భారత్ అప్రమత్తయింది. భద్రతని కట్టుదిట్టం చేసింది. అంతేకాదు.. వెస్టిండీస్ టూర్ లో ఉన్న భారత క్రికెట్ జట్టుకు ఉగ్ర ముప్పు పొంచిఉందని సమాచారమ్. ఈ నేపథ్యంలో టీమిండియా భద్రతని పెంచారు. వెస్టిండీస్‌లోని భారత హై‌కమీషన్‌తో పాటు ఆంటిగ్వా ప్రభుత్వాన్ని అప్రమత్తం చేశారు.

పాకిస్థాన్ గడ్డపై క్రికెట్ ఆడేందుకు ఏ అగ్రశ్రేణి జట్టు సాహాసం చేయడం లేదు. 2009లో పాకిస్థాన్ గడ్డపై సిరీస్ ఆడేందుకు వెళ్లిన శ్రీలంక జట్టుపై లాహోర్‌లో ఉగ్రదాడి జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది మార్చిలో న్యూజిలాండ్‌లో పర్యటించిన బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు కొద్దిలో ఉగ్రదాడి నుంచి తప్పించుకొంది. ఈ అనుభవాల దృష్ట్యా విండీస్ టూర్ లో టీమిండియాకు భద్రతని పెంచారు.

ఇక, విండీస్ టూర్ లో టీమిండియా ఇప్పటికే టీ20, వన్డే సిరీస్ లని క్లీన్ స్పీప్ చేసింది. ప్రస్తుతం విండీస్-ఎ తో ప్రాక్టీస్ మ్యాచ్ ఆడుతోంది టీమిండియా. గురువారం నుంచి మొదటి టెస్ట్ ప్రారంభం కానుంది. టెస్ట్ సిరీస్ కూడా క్లీన్ స్వీప్ చేయాలనే పట్టుదలతో కోహ్లీ సేన ఉంది. కనీసం టెస్ట్ సిరీస్ లోనైనా గెలుపొంది పరువు కాపాడుకోవాలని విండీస్ భావిస్తోంది.