ఆ మూడు సందర్భాల్లో అన్నయ్య కాపాడాడు


జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఇన్నాళ్లకి ట్రాక్ లోకి వచ్చాడు. రాజకీయాల్లో పడి ఫ్యామిలీని దూరంపెట్టిన పవన్.. ఇప్పుడు ఫ్యామిలీ, ఫ్యాన్స్, పాలిటిక్స్ ని బ్యాలెన్స్ గా డీల్ చేసేందుకు రెడీ అయ్యారు. ఆగస్టు 22 చిరంజీవి పుట్టిన రోజు. ఈ సందర్భంగా బుధవారం హైదరాబాద్‌లో అభిమానుల మధ్య చిరు పుట్టిన రోజు వేడుకలు జరిగాయి. ముఖ్య అతిథిగా పవన్‌ కల్యాణ్‌ హాజరయ్యారు. ఈ సందర్భంగా అన్నయ్యకి తనకి అండగా నిలిచిన మూడు సందర్భాలని గుర్తు చేస్తుకొన్నారు.

“నేను ఇంటర్‌ ఫెయిల్‌ అయినప్పుడు నిరాశ నిస్పృహలకు లోనయ్యా. అన్నయ్య దగ్గరున్న లైసెన్స్‌ పిస్టోల్‌ తీసుకుని కాల్చుకుని చనిపోదామనుకున్నా. కానీ ఆరోజు అన్నయ్య చెప్పిన మాటలు నాలో విశ్వాసం నింపాయి. యుక్త వయసులో ఉన్నప్పుడు భారతదేశాన్ని ఎవరైనా ఏమైనా అంటే కోపంతో ఊగిపోయేవాడ్ని. ఆ సమయంలో ‘నువ్వు కులం, మతం దాటి మానవత్వం వైపు ఆలోచించాలి’ అని అన్నయ్య హితబోధ చేశారు. 22 ఏళ్ల వయసులో ఓ ఆశ్రమంలో చేరిపోయా. ‘నాకేం అవసరం లేదు. ఇలా ఉండిపోతా’ అని చెప్పాను. నువ్వు భగవంతుడివైపు వెళ్లిపోతే సమాజానికి ఎందుకూ ఉపయోగపడవు. బాధ్యతలు ఉంటే ఈ మాటలు మాట్లాడవు అని నన్ను అన్నయ్య ఆపారు. ఆ మాటలే ఈరోజు మీ ముందు నిలబడేలా చేశాయి” చెప్పుకొచ్చారు పవన్.