తిరుపతిలో అన్యమత ప్రచారం వెనక వైసీపీ ?
తిరుపతిలో అన్యమత ప్రచారం అంశం మరోసారి వెలుగులోనికి వచ్చింది. తిరుమలలో బస్ టికెట్ వెనుక అన్యమత ప్రచారం ఉండటంపై బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయం సీఎం జగన్ కు తెలుసా ? అని ప్రశ్నించారు తెలంగాణ భాజాపా ఎమ్మెల్యే రాజా సింగ్. తప్పు చేసిన వారిపై జగన్ చర్యలు తీసుకోవాలని, అన్యమత ప్రచార విధానాన్ని వెంటనే రద్దు చేయాలని రాజాసింగ్ డిమాండ్ చేశారు. ఇదే అంశంపై ఏపీ భాజాపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ స్పందించారు.
టీటీడీలో అన్యమత ప్రచారం జరుగుతోందని ఇంతకు ముందే ఒకసారి చెప్పామని… మత విశ్వాసాలను గౌరవించాలని అన్నారు. వైసీపీ ప్రభుత్వం ఒక మతాన్ని ప్రచారం చేయడం సరికాదని మండిపడ్డారు. ఈ ఇద్దరు బీజేపీ నేతలు కూడా స్వయంగా వైసీపీనే టీటీడీలో అన్యమత ప్రచారం చేస్తుంది అన్నట్టుగా మాట్లాడారు. వాస్తవానికి ఈ విషయం వైసీపీ దృష్టికి కూడా వచ్చినట్టు లేదు. దీనిపై సీఎం జగన్ దృష్టి సారించి.. భాజాపా నేతలకు విమర్శించే ఛాన్స్ ఇవ్వకుండా చేస్తారేమో చూడాలి.