కాంగ్రెస్ లో మోడీకి పెరుగుతున్న బలం.. !


వినడానికి విచిత్రంగా ఉన్నా.. ఇది నిజం. కాంగ్రెస్ లో ప్రధాని నరేంద్ర మోడీని సపోర్టు చేసే నేతల లిస్టు రోజు రోజుకి పెరుగుతోంది. ఆర్టికల్ 370, జమ్ముకశ్మీర్ విభజనపై కాంగ్రెస్ వ్యతిరేకంగా మాట్లాడింది. కానీ, ఆ పార్టీలోని చాలామంది నేతలు జమ్ముకశ్మీర్ విషయంలో మోడీ ప్రభుత్వం తీసుకొన్న నిర్ణయాన్ని సమర్థించారు. వారు దేశ భద్రతకి సంబంధించిన విషయాల్లో రాజకీయాలు చేయొద్దన్నారు. దీన్ని కూడా కాంగ్రెస్ గొప్పగా చెప్పుకొంది. తమ పార్టీలో వాక్ స్వాత్రంత్య్రం ఎక్కువని ప్రకటించుకొంది.

కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి జైరాం రమేష్ గురువారం బాహాటంగానే ప్రధాని మోడీని సమర్థించారు. 2014-19 మధ్య కాలంలో మోడీ చేసిన పనులని గుర్తించాల్సి ఉంది. అదే భాజాపాని రెండోసారి అధికారంలో తీసుకొచ్చింది. ప్రధాని జనాల హృదయాలని తాకే బాషని మాట్లాడతారు. గతంలో ఎవరు చేయని పనులని, ప్రజలు గుర్తించుకునే పనులని మోడీ చేస్తున్నారు. ఈ విషయాన్ని మనం గుర్తించకపోతే.. ఆయన్ని ఎదుర్కోవడం కష్టమన్నారు జైరాం. ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకం మంచి ఫలితానిచ్చింది. రైతులు మోడీపై నమ్మకముంచారు అన్నారు జైరాం. తాజాగా మోడీకి మద్దతుగా మరో కాంగ్రెస్ నేత నోరు తెరిచారు.

ప్రధానిమోడీని దోషిగా నిలబెట్టాలనుకోవడం సరికాదని కీలక వ్యాఖ్యలు చేశారు కాంగ్రెస్ సీనియర్ నేత అభిషేక్ మను సింఘ్వి. మోడీని ఏకపక్షంగా విమర్శిస్తూ పోతే… చివరకు ఆయనకే లాభిస్తుందని స్పష్టం చేశారు. మోదీ సాధించిన విజయాల గురించి, ఆయనకు సంబంధించిన పాజిటివ్ అంశాల గురించి కూడా మాట్లాడాలని, లేకపోతే విపక్షాలకే నష్టమని సూచించారు సంఘ్వి. నిజంగా ఈ ఇద్దరు కాంగ్రెస్ సీనియర్లు మోడీ పాలన మెచ్చారా.. ? లేదంటే భాజాపాలో చేరేందుకు ముందుస్తుగా మాట్లాడిన మాటలా ?? అనేది కాలమే చెప్పాలి.