అరుణ్‌ జైట్లీ ఇకలేరు !

కొంతకాలంగా అనారోగ్యంతో ఢిల్లీ ఎయిమ్స్ లో చికిత్స పొందుతున్న భాజాపా సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి అరుణ్ జైట్లీ కన్నుమూశారు. కొద్దిరోజులుగా వెంటిలేటర్‌పై ఉన్న ఆయన ఆరోగ్య పరిస్థితి పూర్తిగా విషమించిందని వైద్యులు తెలిపారు. ఈ మధ్యాహ్నం 12 గంటలకు జైట్లీ తుదిశ్వాస విడిచారు.

1991 నుంచి జైట్లీ భాజపా జాతీయ కార్యవర్గ సభ్యుడిగా ఉన్నారు. 1999 అక్టోబరు 13న వాజ్‌పేయీ ప్రభుత్వంలో సమాచార ప్రసారశాఖ సహాయ మంత్రిగా పని చేశారు. 2000 జులై 23న సామాజిక, న్యాయశాఖ సహాయ మంత్రిగా అదనపు బాధ్యతలు నిర్వర్తించారు. అదే ఏడాది నవంబరులో జైట్లీకి కేబినెట్‌ హోదా దక్కింది.

2009 జూన్‌ 3న జైట్లీ రాజ్యసభలో ప్రతిపక్ష నేతగా ఎన్నికయ్యారు. మోదీ ప్రభుత్వంలో ఆర్థికశాఖ, కార్పొరేట్‌ వ్యవహారాల మంత్రిగా పని చేశారు. 2017లో అప్పటి రక్షణ మంత్రి మనోహర్‌ పారికర్‌ గోవా ముఖ్యమంత్రిగా వెళ్లడంతో ఆ శాఖ బాధ్యతలు నిర్వర్తించారు. 2016లో సమాచార ప్రసారశాఖ అదనపు బాధ్యతలు నిర్వర్తించారు. ఈ ఏడాది కేంద్రంలో మళ్లీ భాజపా విజయ ఢంకా మోగించినా, ఆరోగ్య పరిస్థితి కారణంగా కేంద్ర మంత్రివర్గంలోకి ఆయన చేరలేదు.