సచిన్ రికార్డ్ ని కోహ్లీ ఛేదించలేడు : సెహ్వాగ్

‘రికార్డుల రారాజు’ విరాట్ కోహ్లీ. ప్రపంచ క్రికెటర్ల పేరుమీదున్న ఎన్నో రికార్డులను కోహ్లీ అలవోకగా ఛేదించేశాడు. తన పేరుమీద సరికొత్త రికార్డులని సృష్టిస్తున్నాడు. ఈ క్రమంలో సచిన్ పేరిట ఉన్న వంద సెంచరీల రికార్డుని అందుకొనేలా కనబడుతున్నాడు. కానీ సచిన్‌ చేసిన ఆ ఒక్క రికార్డును మాత్రం కోహ్లీ చేరుకోలేడట. ఈ విషయాన్ని వీరేంద్ర సెహ్వాగ్‌ స్వయంగా చెప్పుకొచ్చాడు.

“కోహ్లీ బెస్ట్‌ బ్యాట్స్‌మెన్‌. అతడు సెంచరీలు చేసే విధానం, పరుగులు రాబట్టే తీరు అతడిని ఉన్నత స్థానంలో ఉంచింది. అతడు సచిన్‌ పేరిట ఉన్న రికార్డులన్నీ దాదాపుగా బ్రేక్‌ చేస్తాడు. కానీ సచిన్‌ పేరిట ఉన్న ఒక్క రికార్డును మాత్రం కోహ్లీతో సహా ఎవరూ బ్రేక్‌ చేయలేరు. సచిన్‌ ఆడిన 200 టెస్టుల రికార్డును ఛేదించడం దాదాపుగా అసాధ్యమేమో. ఎందుకంటే 200 కంటే ఎక్కువ టెస్టులు ఎవరూ ఆడలేరనుకుంటున్నా” అన్నాడు సెహ్వాగ్‌. సచిన్ తర్వాత ఎక్కువ మ్యాచులు ఆడిన వార్లలో రికీ పాంటింగ్‌(168) రెండో స్థానంలో ఉన్నాడు. కోహ్లీ ఇప్పటివరకు 77 టెస్టులు మాత్రమే ఆడాడు. మొత్తం 6,613 పరుగులు చేశాడు. ఇందులో 25 సెంచరీలున్నాయి.