రివ్యూ : సాహో


చిత్రం : సాహో (2019)

నటీనటులు : ప్రభాస్‌, శ్రద్ధ కపూర్‌, వెన్నెల కిషోర్‌, మురళీ శర్మ, జాకీ ష్రాఫ్‌, నీల్‌ నితిన్‌ ముఖేశ్‌, అరుణ్‌ విజయ్‌, మందిరా బేడీ తదితరులు

సంగీతం : తనిష్క్‌ బగ్చీ, గురు రాంద్వా, బాద్‌షా, జిబ్రాన్‌ (నేపథ్యం)

దర్శకత్వం : సుజీత్‌

నిర్మాతలు : యూవీ క్రియేషన్స్‌, టీ సిరీస్‌

రిలీజ్ డేట్ : ఆగస్ట్ 30, 2019

బాహుబలి – తెలుగు సినిమా స్థాయిని పెంచిన సినిమా. ప్రభాస్ ని ఇంటర్నేషనల్ స్టార్ ని చేసిన సినిమా. అందుకే ‘బాహుబలి’ తర్వాత సాహో కథని ఎంచుకొన్నారు. బాహుబలి సినిమాకి పూర్తిగా భిన్నమైన సినిమా. ఇదో యాక్షన్ థ్రిల్లర్. అది అభిమానులకి నచ్చుతుంది ప్రభాస్ భావించారు. కేవలం ఒకే ఒక్క సినిమా తీసిన దర్శకుడు సుజీన్ ని నమ్మాడు. ఇందుకోసం రెండేళ్ల పాటు కష్టపడ్డాడు. ‘ఇట్స్‌ షో టైమ్‌…’ అంటూ సాగిన టీజర్‌ వచ్చినప్పటి నుంచే సినిమా మీద ఆసక్తి నెలకొంది.

ఆ తర్వాత విడుదల చేసిన ప్రతి లుక్‌, వీడియోలతో అది మరింత ఎక్కువైంది. టీజర్, ట్రైలర్ తో ఇది అంతర్జాతీయ స్థాయి సినిమా అనిపించింది. మరీ.. సాహో ఆ రేంజ్ లో ఉందా ? మరోసారి ప్రభాస్ తెలుగు సినిమా గురించి ప్రపంచవ్యాప్తంగా మాట్లాడుకొనేలా చేశాడా ? ఇంతకీ సాహో కథేంటీ ? అది ఏ మేరకు ప్రేక్షకులకి కనెక్ట్ అయింది.. తెలుసుకొనేందుకు రివ్యూలోకి వెళదాం పదండీ.. !

కథ :

దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 2000 కోట్ల దొంగతనం జరుగుతోంది. ఎలా చేశారు అనేది అర్దమవుతుంది. కానీ ఎవరు చేశారో మాత్రం అర్దం కాదు. అంత తెలివిగా దొంగతనం జరిగింది. దొంగ ఒక్క క్లూ కూడా వదలడు. ఆ కేసులో అండర్ కవర్ పోలీస్ గా అశోక్ చక్రవర్తి(ప్రభాస్)ని అపాయింట్ చేస్తారు. అశోక్ ఒక్కో క్లూ పట్టుకుంటూ దొంగ (నీల్ నితిన్ ముఖేష్)ని ట్రేస్ చేస్తాడు. ఐతే, ఆ దొంగకు డిపార్టమెంట్ నుంచి ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ అందుతుండటంతో తప్పించుకుంటాడు. ఈ నేపథ్యంలో అతడిని దొంగే అని ప్రూవ్ చేయాలంటే రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవాలని డిసైడ్ అవుతాడు. దీనికోసం అశోక్ మరో స్కెచ్ వేస్తాడు.

ఆ దొంగకు ఎరవేసి అతని దారిలోనే వెళ్లి పట్టుకోవాలని ఫిక్స్ అవుతాడు. ఆ ప్లాన్ ఏంటన్నది తెరపై చూడాల్సిందే. ఇక అశోక్ కు డిపార్టమెంట్ తరపున సాయిం చేయటానికి క్రైమ్ బ్రాంచ్ ఆఫీసర్ అమృతానాయర్ (శ్రద్దా కపూర్) డ్యూటీ వేస్తాడు. మెల్లిగా అశోక్ ఆమెతో ప్రేమలో పడతూంటాడు. మరోవైపు, దొంగ తాగిన మైకంలో ఓ విలువైన ఇన్ఫర్మేషన్ అశోక్ కు ఇచ్చేస్తాడు.

వాజీ సిటిలో ఓ మిస్టీరియస్ బ్లాక్ బాక్స్ ఉంది. దాని కోసం చాలా మంది గ్యాంగస్టర్స్ వెతుకుతున్నారని, తను కూడా దాని కోసం ట్రై చేద్దామనుకుంటున్నాడని చెప్తాడు. దాంతో అశోక్ ఆ బ్లాక్ బాక్స్ దొంగతనం సమయంలోనే రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవాలని డిపార్టమెంట్ తో కలిసి ప్లాన్ చేస్తాడు. మరోపక్క సిటీలో ఓ పెద్ద డాన్ రాయ్ (జాకీ షరాఫ్)ని కొందరు రైవల్ బ్యాచ్ యాక్సిడెంట్ చేసి చంపేస్తారు. అతను కొడుకు (అరుణ్ విజయ్) తన తండ్రి ప్లేస్ లోకి వస్తాడు. అంతేకాక తండ్రిని చంపిన వాళ్లపై పగ తీర్చుకోవాలని ప్రయత్నం చేస్తూంటాడు. ఈ రాయ్ గ్యాంగ్ కు అశోక్ లింక్ ఏంటి..ఆ బ్లాక్ బాక్స్ మిస్టరీ ఏమిటి.. ? ఇంతకీ అసలు సాహో ఎవరు ? అనేది అదిరిపోయే యాక్షన్, ట్విస్టులతో కూడిన మిగిలిన కథే సాహో.

ప్లస్ పాయింట్స్ :

* ప్రభాస్

* యాక్షన్ సీన్స్

* నేపథ్య సంగీతం

* నిర్మాణ విలువలు

* ఇంటర్వెల్ ట్విస్ట్, బ్యాడ్ బోయ్ సాంగ్

మైనస్ పాయింట్స్ :

* స్కీన్ ప్లే

* ఎమోషన్

* వినోదం

* మితిమీరిన ట్విస్టులు

ఎవరెలా చేశారంటే ?

బాహుబలి తర్వాత ప్రభాస్ చేస్తున్న సినిమా కోసం ఓ స్టార్ డైరెక్టర్ ని ఎంచుకొంటే.. అంచనాలు ఓ రేంజ్ లో ఉండేవి. అందుకు భిన్నంగా సుజీత్ లాంటి యంగ్ డైరెక్టర్ ని ఎంచుకొని తనపై ఒత్తిడి తగ్గించుకొన్నాడు ప్రభాస్. ఇది మంచిదే అనుకొన్నారు. ఐతే, టీజర్, ట్రైలర్ చూశాక సాహో అంతర్జాతీయ సినిమా అనిపించింది. బాహుబలి’ ప్రభాస్‌, బాలీవుడ్‌ దివా శ్రద్ధ కపూర్‌ ఓ పక్క… భారీ తారాగణం, అంతకుమించిన భారీ యాక్షన్‌ సన్నివేశాలు కలిపి సినిమా ఆసక్తికరంగా రూపొందింది. యాక్షన్ సీన్స్, ట్విస్టులపై పెట్టిన శ్రద్దని దర్శకుడు కథపై పెట్టలేదు. ఫలితంగా సాహోలో యాక్షన్ హైలైట్ గా ఉన్నా.. హాలీవుడ్ రేంజ్ లో ఉన్న కథ ప్రేక్షకుడికి కనెక్ట్ కాలేదు. ఎమోషన్, వినోదం మిస్సయింది. మొత్తంగా దర్శకుడు అనుభవలేమీ కొట్టొచ్చినట్టు కనిపించింది.

ఇక ప్రభాస్ నటనకి వంకపెట్టలేం. ప్రభాస్‌ అండర్‌ కవర్‌గా కాప్‌గా అదరగొట్టాడు. సెటిల్డ్‌గా కనిపిస్తూ, యాక్షన్‌ సన్నివేశాల్లో తనదైన ఈజ్‌ను చూపించాడు. సినిమా ద్వితీయార్ధంలో షేడ్స్‌ మార్చడంలో పరిణితిని చూపించాడు. యాక్షన్‌ సన్నివేశాల్లో కొన్ని చోట్ల హాలీవుడ్‌ హీరోలను తలపించాడు. చాలావరకు సినిమా ప్రభాస్‌ వన్‌మ్యాన్‌ షోగా నడుస్తుంది. పోలీసు అధికారిణిగా శ్రద్ధ కపూర్‌ చక్కగా ఒదిగిపోయింది. సగటు అమ్మాయిలా కనిపిస్తూ… అవసరమైనప్పుడు ఫైట్లు చేస్తూ పాత్రకు న్యాయం చేసింది.

ప్రభాస్-శ్రద్దా మధ్య ప్రేమ సన్నివేశాలు బాగా పండాయి. శ్రీలంక అందం జాక్వెలైన్‌ ఫెర్నాండెజ్‌తో ప్రభాస్‌ ఆడిపాడిన ‘బ్యాడ్‌ బాయ్‌…’ పాట కుర్రకారుకి కిక్‌ ఇస్తుంది. మిగిలిన పాత్రలకు అంతగా అవకాశం లేదు. భారీ యాక్షన్‌ సన్నివేశాలు సినిమాకు ప్రధాన ఆకర్షణ. హాలీవుడ్‌ స్టంట్ మాస్టర్లు కెన్నీ బేట్స్‌, పెంగ్‌ జాంగ్‌, స్టీఫెన్‌ రిట్చెర్‌, బాబ్‌ బ్రౌన్‌తోపాటు దిలీప్‌ సుబ్బరాయన్‌, స్టంట్‌ శివ, రామ్‌ లక్ష్మణ్‌ అదుర్స్‌ అనిపించారు. ఐతే, దేవరాజ్‌ పాత్ర తప్ప మిగిలిన డాన్‌లు అంత పవర్‌ఫుల్‌గా లేకపోవడమూ ఓ లోటు.
కల్కిగా మందిరా బేడీ బాగా చేసింది. జాకీ ష్రాఫ్‌, టిను ఆనంద్‌, అరుణ్‌ విజయ్‌, నీల్‌ నితిన్‌ ముఖేశ్‌, మురళీ శర్మ తమ పాత్రల మేరకు నటించారు.

సాంకేతికంగా :

సాహోలో యాక్షన్ అదిరిపోయింది. భారీ యాక్షన్‌ సీన్లతో తెలుగు తెరను హాలీవుడ్‌ స్టైల్‌ ఫైట్లతో నింపేశారు. జిబ్రాన్ నేపథ్య సంగీతం బాగుంది. శ్రీకర్‌ ప్రసాద్‌ ఎడిటింగ్‌ షార్ప్ గా ఉంది. యూవీ క్రియేషన్స్‌ నిర్మాణ విలువలు బాగున్నాయి. కమల్‌ కణ్నన్‌ విజువల్‌ ఎఫెక్ట్స్‌, సాబు సిరిల్‌ ప్రొడక్షన్‌ డిజైనింగ్ బాగుంది. కథ, స్క్రీన్ ప్లే విషయంలో దారి తప్పినా సుజీత్ మేకింగ్ విషయంలో తన టాలెంట్ చూపాడు.

చివరగా : ఫ్యాన్స్, డై హార్ట్ ఫ్యాన్స్ సాహో అంటారు.

రేటింగ్ : 3/5