గంటా చరిత్ర చాలా నీచమట !
నమ్మించి ద్రోహం చేయడం మాజీ మంత్రి గంటా శ్రీనివాస్ నైజమని తీవ్ర విమర్శలు చేశారు మంత్రి అవంతి శ్రీనివాస్. తన జోలికి వస్తే గంటా చరిత్ర మొత్తం బయటపెడతానని, ఆయన విశాఖలో ఉండలేరని హెచ్చరించారు. గంటాకు ఏ పార్టీలోనూ ఆఫర్ లేదని..
అవినీతిపరులు, భూకబ్జాకోరులకు వైకాపాలో చోటు లేదన్నారు అవంతి. ఐదేళ్లపాటు అధికారం అనుభవించి.. అధికారం పోగానే పార్టీ మార్పు కోసం ఆలోచించడం అంతకంటే దిగజారుడు రాజకీయం మరోటి ఉండదని దుయ్యబట్టారు.
మరోవైపు గంటా ఎప్పుడు సేఫ్ జోన్ లో ఉంటారనే ప్రచారం ఉంది. ఎన్నికల ముందే ఆయన పార్టీ మారుతుంటారు. ఆయన మారిన పార్టీ అధికారంలోకి రావడం.. కాపు కోటాలో గంటాకి మంత్రి పదవి దక్కడం జరుగుతుండేవి. ఐతే, ఈసారి గంటా లెక్క తప్పింది. ఏపీ అసెంబ్లీ ఎన్నికలకి ముందే ఆయన వైసీపీలో చేరబోతున్నట్టు ప్రచారం జరిగింది. ఐతే, మళ్లీ మనమే అధికారంలోకి రాబోతున్నామని టీడీపీ అధినేత చంద్రబాబు గట్టిగా చెప్పడంతో.. ఆ పార్టీలోనే ఉండిపోయారు. ఇక కొన్నాళ్లుగా గంటా వైసీపీలో చేరబోతున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో మంత్రి అవంతి శ్రీనివాస్ గంటాకి గట్టి హెచ్చరికలు చేశారని విశ్లేషకుల మాట.