అలర్ట్ : ఈ లింకు క్లిక్ చేస్తే.. మీ ఖాత ఖాళీ

సైబర్ నేరగాళ్లు సరికొత్త మోసలకి తెరలేపుతున్నారు. ఇన్నాళ్లు మీ ఏటీఎం కార్డ్ బ్లాక్ అయింది. లాటరీ వచ్చింది. రుణం ఇపిస్తామని మాయ మాటలు చెప్పి డబ్బులు ఖాళీ చేసేవారు. దీనిపై ప్రజల్లో చైతన్యం వచ్చింది. దీంతో అంత ఈజీగా బుట్టలోపడటం లేదు. ఈ నేపథ్యంలో మోసలకు కొత్త దారులు వెతుకుతున్నారు సైబర్ నేరగాళ్లు. తాజాగా ఐటీ రిఫండ్ అంటూ మోసాలకు పాల్పడుతున్నారు.

ఆదాయపన్నుకు సంబంధించిన ఈ ఫైలింగ్‌లో మీకు రూ. 20 వేలు రిఫండ్ వచ్చింది. మేం పంపించే లింక్‌ను మీరు క్లిక్ చేసి కావల్సిన సమాచారం ఇస్తే.. మీ డబ్బులు మీకొస్తాయంటూ వల వేస్తున్నారు. ఈ వలలో చిక్కితే బ్యాంకు ఖాతాలు ఖాళీ అవుతాయని సైబర్ క్రైమ్ పోలీసులు హెచ్చరిస్తున్నారు.

ఇటీవల ఆదాయపన్ను రిటర్న్స్ తేదీ గడువు ముగిసింది. చాలామంది వ్యాపారులు, ఉద్యోగులు ఆయా రిటర్న్స్ దాఖలు చేశారు. దాన్ని క్యాష్ చేసుకొన్న సైబర్ నేరగాళ్లు.. వారికి మెసేజ్‌లు పంపిస్తుంటారు. సైబర్‌నేరగాళ్లు పంపించే లింక్‌ను క్లిక్ చేయగానే ఒక ఫారం వస్తుంది. అందులో బ్యాంకు వివరాలు పొందుపరచాలని సూచిస్తారు. అందులో బ్యాంకు వివరాలను నింపిన వెంటనే సెల్‌ఫోన్‌కు ఓటీపీ వస్తుంది. అది కూడా చెప్పగానే .. ఆ బ్యాంకు ఖాతాలో నుంచి డబ్బులను సైబర్ నేరగాళ్లు కాజేస్తారు. దీనిపట్ల అప్రమత్తంగా ఉండాలని సైబర్ పోలీసులు సూచిస్తున్నారు.