హరీష్ రావు సీఎం కావాలని టీఆర్ఎస్ నేత మొక్కు.. !
తెరాసలో హరీష్ రావుని తొక్కేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే హరీష్ కు రెండోసారి మంత్రి పదవి ఇవ్వలేదు. కాలేశ్వరం ప్రాజెక్ట్ ఓపెనింగ్ కు కూడా ఆహ్వానించలేదని సొంత పార్టీ నేతలే గుసగుసలాడుకొన్నారు. ఈ నేపథ్యంలో హరీష్ పై ప్రజల్లో సానుభూతి పెరుగుతోంది. మరోవైపు త్వరలో సీఎం కేసీఆర్ చేపట్టబోయే మంత్రివర్గ విస్తరణలో హరీష్ కి బెర్త్ ఖాయమైందనే ప్రచారం జరుగుతోంది. ఈ విషయం పక్కనపెడితే.. హరీష్ ఏకంగా సీఎం కావాలనే డిమాండ్ తెరాసలో ప్రారంభం అయింది. తాజాగా విష్ణు అని తెరాస నేత హరీష్ సీఎం కావాలని మొక్కుకొన్నారు.
విష్ణు పార్టీలో ఏ రేంజ్ నాయకుడు అనేది తెలియదు. కానీ హరీష్ రావు ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటూ విష్ణు జోగుళాంబ గుడిలో 1016 కొబ్బరికాయలు కొట్టారు. హరీష్ దమ్మున్న నాయకుడిగా విష్ణు అభివర్ణించారు. కాళేశ్వరం ప్రాజెక్టు కోసం హరీష్ రావు ఎంతో కష్టపడ్డారని, ప్రారంభోత్సవానికి హరీష్ రావును పిలువకపోవడం సరి కాదని ఆయన అన్నారు. విష్ణు వ్యాఖ్యలపై హరీష్ రావు ఏ విధంగా స్పందిస్తారు ? ఈ డిమాండ్ ని తెరాస అధిష్టానం ఏ విధంగా చూడబోతుంది అనేది ఆసక్తిగా మారింది.
మరోవైపు మంత్రి ఈటెల వ్యవహారం పార్టీలో ముదురుతోంది. త్వరలో జరగబోయే కేబినేట్ విస్తరణలో ఇద్దరు మంత్రులకి ఉద్వాసన పకలనున్నారు. అందులో ఈటెల ఒకరు అనే ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇటీవల హుజూరాబాద్ నియోజకవర్గంలో జరిగిన సమావేశంలో ఈటెల గట్టిగానే మాట్లాడారు. తాము పార్టీ ఓనర్లమని అన్నారు. ఇక మంగళవారం టీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాటలు వింటే.. ఆయన ఈటెలని టార్గెట్ చేసినట్టుగా అనిపించింది. మొత్తానికి తెరాసలో అంతర్గత విబేధాలు భగ్గుమనబోతున్నాయనే సంకేతాలు కనిపిస్తున్నాయి. మరీ.. వాటిని సీఎం కేసీఆర్ ఎలా చల్లబరుస్తారు ? అనేది చూడాలి.