సెలక్షన్ కమిటీ సభ్యుడికి బంగర్ బెదిరింపులు


ప్రపంచకప్ తో రవిశాస్త్రి, బంగర్, భరత్ అరుణ్, శ్రీధర్ పదవీకాలం ముగిసింది. ఈ లోగా కరీబియన్ పర్యటన ఆరంభం కావడంతో వారికి 45 రోజులు గడువు పొడగించారు. కపిల్ దేవ్ నేతృత్వంలోని క్రికెట్ సలహా కమిటీ మళ్లీ శాస్త్రికే పట్టం కట్టింది. సహాయ సిబ్బంది ఎంపిక మాత్రం ఎమ్మెస్కే ప్రసాద్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ చేపట్టింది. మిగిలిన ముగ్గురికీ బీసీసీఐ కాంట్రాక్టు దక్కినా అనుకున్నట్టుగానే బంగర్ పై వేటు పడింది. ఆయన స్థానంలో విక్రమ్ రాఠోడ్ ను బ్యాటింగ్ కోచ్ గా కమిటీ ఎంపిక చేసింది.

తనని తిరిగి తీసుకోలేదని బంగర్ సెలక్షన్ కమిటీ సభ్యుడు దేవాంగ్ గాంధీపై బెదిరింపులకి పాల్పడ్డాడట. ఈ విషయం కాస్త ఆలస్యంగా వెలుగులోనికి వచ్చింది. ఓ హోటల్ లో బస చేస్తున్న సెలక్షన్ కమిటీ సభ్యుడు దేవాంగ్ గాంధీ గదికి బంగర్ ఆవేశంగా వెళ్లాడట. గదిలోకి ప్రవేశించి ఆయనతో అమర్యాదకరంగా ప్రవర్తించాడు. జట్టు తనకు అండగా ఉందని సెలక్షన్ కమిటీని బెదిరించాడు. తనను తొలగించాలన్న నిర్ణయాన్ని వారు ఒప్పుకోరని హెచ్చరించాడు.

ఒకవేళ బ్యాటింగ్ కోచ్ గా ఎంపిక చేయకుంటే జాతీయ క్రికెట్ అకాడమీలో ఏదో ఒక పదవి ఇప్పించాలని కోరాడట. ఇప్పుడీ వ్యవహారం క్రికెట్ పాలకుల కమిటీ అధినేత వినోద్ రాయ్ దృష్టికి చేరింది. నిజానిజాలు ఏమిటో తెలుసుకొనేందుకు ఇప్పటికే బీసీసీఐ ప్రయత్నాలు మొదలుపెట్టింది. బంగర్ బెదిరింపులు నిజమేనని తేలితే మాత్రం ఆయనకి కఠిన శిక్ష తప్పదని అంటున్నారు.