చంద్రయాన్-2 : ల్యాండర్ కక్ష్య తగ్గింపు 2సార్లు విజయవంతం
జాబిల్లిపై కాలు మోపే లక్ష్యంతో భారత్ ప్రయోగించిన చంద్రయాన్-2 ప్రతి అంచెనూ విజయవంతంగా దాటుకుంటూ ముందుకెళ్తోంది. చంద్రయాన్-2లోని ల్యాండర్ విక్రమ్ కక్ష్య తగ్గింపును ఇస్రో శాస్త్రవేత్తలు రెండోసార్లు విజయవంతంగా పూర్తి చేశారు. మంగళవారం ఉదయం 8.50 గంటలకు ల్యాండర్ లోని చోదక వ్యవస్థను నాలుగు సెకన్ల పాటు మండించి దాని కక్ష్యను తగ్గించారు. దీంతో అది 104 కిలోమీటర్లు 128 కిలోమీటర్ల కక్ష్యకు చేరింది.ఇక బుధవారం తెల్లవారుజామున 3:42గంటలకు కక్ష్య తగ్గింపును రెండోసారి విజయవంతంగా పూర్తి చేశారు. దీనికోసం ల్యాండర్ లోని చోదక శక్తిని 9సెకన్లపాటు మండించారు. దీంతో చంద్రుడిపై చరిత్రాత్మక ల్యాండింగ్ కి అత్యంత చేరువైంది.
ప్రస్తుతం ల్యాండర్ 35కిలోమీటర్లుx101 కి.మీ కక్ష్యలో ఉండగా.. ఆర్బిటర్ 96కి.మీx 125కి.మీ కక్ష్యలో కొనసాగుతోంది. ఈ నెల6న అర్ధరాత్రి దాటాక 1.30-2.30 గంటల మధ్య ల్యాండర్ చంద్రుడి దక్షిణ ధ్రువానికి చేరువలోని ప్రాంతంలో కాలుమోపుతుంది. కొద్దిగంటల తర్వాత అందులో నుంచి రోవర్ బయటకు వస్తుంది. నిర్దిష్ట ల్యాండింగ్ ప్రదేశాన్ని ల్యాండర్ లోని కెమెరాలు పంపిన చిత్రాల ఆధారంగా శాస్త్రవేత్తలు నిర్ధారిస్తారు.